బాబు మోసగాడు

పాలకొండ రూరల్‌/ వీరఘట్టం: ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు  మోసగాడిలా వ్యవహరిస్తున్నారని తెట్టంగిలో నిర్వహించిన భహిరంగ సభతో తేటతెల్లమైందని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. స్వగృహం వండవలో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పాలకొండ నియోజకవర్గంలో బలహీనంగా ఉందని ఇంటిల్‌జెన్స్‌ వర్గాల ద్వారా గుర్తించిన ముఖ్యమంత్రి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటుచేసి ప్రజలను టీడీపీ వైపు మళ్లించాలని చేసిన ప్రయత్నం తెట్టంగి సభతో బెడిసి కొట్టిందన్నారు. ఏదో చేద్దామని, ఎన్నో ఊహించుకుని ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టాలని చూసిన చంద్రబాబు నైజం ప్రజలకు అర్ధమైందన్నారు. తన ఎదుగుదల కోసం ఇతరులను ధ్వేషించే నైజం చంద్రబాబుదని తెట్టంగి ప్రజలు గుర్తించారన్నారు. ఇంటింటా అంటూ ఇంటి దొంగల వలే ముందుగా గుర్తించిన ఇళ్లకే వెళ్లి సీఎం పలకరించటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయన్నారు. ఇతరులను విమర్శించే ముందు తమ బాగోతాలను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలను ప్రామాణికంగా చూపించి ప్రజలను మోసగించలేరన్నారు.

నీరు–చెట్టుతో నిధులు దోపిడీ....
నియోజవర్గంలో నీరు–చెట్టు పేరిట కోట్లరూపాయల్లో నిధులు దోపిడీ చేసిన ఘనత టీడీపీ నాయకులదేనన్నారు. అభివృద్ధి పనుల పేరిట అవినీతికి పాల్పడుతున్న టీడీపీ నాయకులను నిలదీస్తే.... అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైయస్సార్సీపీ నాయకులపై దుష్ర్పచారం చేయటం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో టీడీపీ గెలుపొందుతుందని ఆశించిన అధికార పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చేపరిస్థితి ఉండదన్నారు. శిశుపాలుడు వంద తప్పులు చేస్తే క్షమించిన శ్రీక్రిష్ణుడుకి ఉన్న సహనం ప్రస్తుతం ప్రజలకు లేదని.... తప్పు చేసిన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగాఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. కేవలం వైసీయస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలల్లో టీడీపీని నిద్రలేపాలని చూడటం అవివేకమన్నారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించటం మానుకోవాలని..... కల్లబొల్లి హామీలు ఇచ్చి ప్రజలను మరోమారు మోసగించ వద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top