కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధి చెప్పండి!

హైదరాబాద్‌, 21 అక్టోబర్ 2012 : జగనన్నను దేవుడే బయటకు తీసుకువస్తాడనీ, ఆనాడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదనీ, మనమంతా రాజన్న రాజ్యం దిశగా నడుస్తామనీ షర్మిల దృఢంగా అన్నారు.
"ఒక రోజు వస్తుంది. ఎట్లాగైతే ఎగిసే కెరటాన్ని, ఉదయించే సూర్యుడిని ఆపలేరో.. అలాగే ఆ రోజు జగనన్నను కూడా ఆపలేరు." అని ఆమె తన పాదయాత్రలో భాగంగా  పులివెందులలో జరిగిన  సభలో వ్యాఖ్యానించారు. రాజన్న ప్రతి ఆశయాన్ని జగనన్న తీరుస్తాడనీ, ఆ రోజు కోసం ఎదురు చూద్దామనీ అప్పుడు కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధిచెప్పాలనీ షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. "మరో ప్రజా ప్రస్థానం" పాదయాత్రలో భాగంగా మూడో రోజు శనివారం రాత్రి షర్మిల పులివెందుల బహిరంగ సభలో మాట్లాడారు.
ఈ పాదయాత్రలో షర్మిలతో పాటు యస్ విజయమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైయస్ భారతి కూడా పాల్గొన్నారు. వేముల నుంచి పులివెందుల వరకు వారు సైతం పాదయాత్ర చేశారు. బెస్తవారిపల్లి నుంచి పులివెందుల బహిరంగ సభ వరకు నాలుగు కిలోమీటర్ల దాకా షర్మిల కుమార్తె కూడా పాదయాత్రలో నడిచారు. పులివెందులలో షర్మిల యాత్రకు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. 
"మీ రాజన్న గురించి, మీ జగనన్న గురించి నేను మీకు చెప్పాల్సిన పనిలేదు. వారిద్దరిదీ మంచి మనసు, మాట మీద నిలబడే నైజం. నేను రాజన్న పాదాన్ని.
జగనన్నను ఎంపీగా ఐదున్నర లక్షల మెజారిటీతో గెలిపించారనీ, అమ్మ విజయమ్మను తొంభైవేల ఓట్ల మెజారిటీతో గెలిపించారనీ అందుకు వైయస్ కుటుంబం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నదనీ ఆమె చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని పోషిస్తున్న టిడిపిని నిలదీయడం...ఈ రెండే తన యాత్ర లక్ష్యాలని ఆమె వివరించారు. తాను రాజన్న పాదాన్ననీ, జగనన్న విసిరిన బాణాన్ననీ ఆమె జనం హర్షధ్వానాల మధ్య అన్నారు. "కాంగ్రెస్, టీడీపీలు జగనన్నను మన మధ్యకు రానివ్వలేని పరిస్థితి సృష్టించడంతో మీకు ధైర్యం చెప్పమని అన్న నన్ను పంపించాడు. 30 ఏళ్లు కాంగ్రెస్‌కు విశ్వాసంతో సేవ చేస్తే, ప్రతి పథకానికీ వాళ్ల పేర్లే పెడితే వారిచ్చిన బహుమతి ఎఫ్‌ఐఆర్‌లో నాన్న పేరు చేర్చడం. నాన్న చనిపోయినప్పుడు 600 మందికి పైగా గుండె ఆగితే వారిని ఓదార్చాలని కాంగ్రెస్ పార్టీలోని ఒక్కరికీ అనిపించ లేదు. కాంగ్రెస్ వాళ్లకది నచ్చలేదు. వద్దన్నారు. కానీ ఓదారుస్తానని ఇచ్చిన మాట కోసం కట్టుబడిన జగనన్నను కక్ష గట్టి జైల్లో పెట్టారు. కాంగ్రెస్‌లోనే ఉంటే సీఎం కూడా అయ్యేవారని ఆజాద్ అన్నారు. అంటే ఇది కక్ష కట్టి చేశారనే కదా!" అని ఆమె ప్రశ్నించారు. ఇంత ఘోరమైన, నీచమైన రాజకీయాలు అవసరమా అని ఆమె ప్రశ్నించారు.
రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం రైతును విస్మరించిందనీ, విద్యార్థులకు మొండిచేయి చూపిందనీ, ఆరోగ్యశ్రీని కట్టిపెట్టిందనీ, రాజన్న తెచ్చిన ప్రతి పథకానికి తూట్లు పొడుస్తోందనీ ఆమె విమర్శించారు. ఈ ప్రభుత్వం మూడేళ్లలో మూడు సార్లు విద్యుత్తు చార్జీలు పెంచిందనీ, గడిచిన సంవత్సరాలకు చెందిన వాటిపై కూడా సర్‌చార్జీల పేరుతో వేల కోట్ల భారం మోపిందనీ ఆమె దుయ్యబట్టారు. ఈ అన్యాయాన్ని నిలదీయాల్సిన టీడీపీ చోద్యం చూస్తోందనీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిద్రపోతున్నారనుకుంటే ప్రధానప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా నిద్రపోతున్నారనీ ఆమె ఎత్తిపొడిచారు. ఆనాడిచ్చిన రెండు వాగ్దానాలనూ బాబు విస్మరించారు. బాబుకు మాట నిలుపుకునే అలవాటు లేదు. వ్యవసాయం దండగ అంటారు. ప్రాజెక్టులు కడితే రాష్ట్రానికి నష్టం అంటారు. ఉచిత విద్యుత్తు వద్దంటారు. ఆనాడు రైతులు కరువుతో విలవిల్లాడుతూ వలస పోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రజల మైండ్ సెట్ మారాలని చెప్పి, రాష్ట్రాన్ని కంపెనీ అనుకుని తానే సీఈవోనని బాబు అన్నారు. ప్రజల అవసరాలు అర్థం చేసుకుని వాటిని తీర్చే నాయకుడు కావాలా? లేక ప్రజలతో వ్యాపారం చేసే నాయకుడు కావాలా? తన మైండ్‌సెట్ మార్చుకుని ప్రజల గురించే ఆలోచించే నాయకుడు కావాలా? ప్రజల మైండ్‌సెట్ మారాలనే హిట్లర్‌లాంటి నాయకుడు కావాలా? ఆలోచించండి" అని షర్మిల ఉద్వేగంగా ప్రశ్నించారు. బాబు తన ఎనిమిదేళ్ల పాలనలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారని ఆమె గుర్తు చేశారు. బకాయిలు చెల్లించలేక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె ఆవేదనగా అన్నారు. రైతులు ఇలాంటి చంద్రబాబు పాలన అంటేనే భయపడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయనీ, చీకట్లో చిదంబరాన్ని కలిసి తనపై కేసులు లేకుండా చేసుకుంటారనీ ఆమె దుయ్యబట్టారు.
 ఫ్లెక్సీలు..పూలు...
పాదయాత్ర మూడో రోజు శనివారం. ఉదయం 9.45కు వేములలో ప్రారంభమైన యాత్ర రోజంతా వాన జల్లు పడుతున్నా భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.. పులివెందుల సభలో వర్షం కురిసినా జనం కట్టుకదల్లేదు. యాత్రలో వేముల, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లి, కోట తదితర పల్లెల నుంచి భారీ సంఖ్యలో మహిళలు వచ్చి షర్మిలకు సాదరంగా స్వాగతం పలికారు. వేల్పుల గ్రామమైతే జనవాహినితో నిండిపోయింది. ఓ వైపు ఈటెల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు సాగగా, మరో వైపు 500 మందిదాకా మహిళలు మంగళహారతులతో వేల్పుల గ్రామం వద్ద షర్మిలకు ఘనస్వాగతం పలికారు.. ఎటు చూసినా స్వాగత ఫ్లెక్సీలతో ఊరంతా కళకళలాడింది. నాలుగు కిలోమీటర్ల వరకు రెండు ట్రాక్టర్లతో షర్మిలపై పూలవర్షం కురిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం కోసం వేల్పుల సమీపంలోని బీసీ కాలనీ వద్ద షర్మిల విశ్రాంతి తీసుకున్నారు.
సాయంత్రం 4 గంటలకు మళ్లీ యాత్ర ప్రారంభం కాగా, షర్మిల అక్కడికి దగ్గరలోని కాలనీకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత పంట చేలల్లో రైతులను కలిసి మాట్లాడారు. మధ్యలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం ఆమెను కలిసి.. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని విజ్ఞప్తి చేసింది.
బెస్తవారిపల్లిలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 6.15కు పులివెందుల రింగ్‌రోడ్డులో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు. భారీ సంఖ్యలో జనం కదలిరాగా రాత్రి 7.20కి షర్మిల పులివెందుల చేరుకున్నారు. అక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో షర్మిల, విజయమ్మ ప్రసంగించి రాత్రి 8.45కు రాజీవ్‌నగర్ కాలనీకి చేరుకుని బస చేశారు.

Back to Top