కలిసి రాజీనామాలు చేద్దాం రండి


ప్రజల భవిష్యత్తు కోసం అందరం కలిసి పోరాడుదాం
అమరావతిలో కూర్చొని అఖిలపక్ష సమావేశం పెడితే ఒరిగేదేమీ ఉండదు
రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుంది
టీడీపీ ఎంపీలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి విజ్ఞప్తి



హైదరాబాద్‌: రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కనబెట్టి పోరాటం చేసేందుకు టీడీపీ ఎంపీలు కూడా కలిసి రావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం కీలక దశలో ఉందని, దయచేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాజీనామాలకు సిద్ధపడాలని కోరారు. హైదరాబాద్‌  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మిథున్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో హోదా అంటే జైల్లో పెడతామన్న చంద్రబాబు.. హోదా కావాలనడం.. అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమిటని మాట్లాడి.. టీడీపీ కూడా కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం మంచి పరిణామమన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎంపీలమంతా కలిసికట్టుగా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దయచేసి మీరు కూడా మాతో కలిసి రావాలని కోరారు. 

ఎందుకు వెనకడుగు వేస్తున్నారో.. అర్థం కావడం లేదు

రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేసిన వైయస్‌ జగన్‌కు పేరువస్తుందని చంద్రబాబు భావిస్తే.. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసిన తరువాత మీ వెంట వచ్చేందుకు వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుందామని... ప్రత్యేక హోదా కోసం అవన్నీ పక్కనబెట్టి ముందుకురావాలన్నారు. అమరావతిలో కూర్చొని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే ఒరిగేదేమీ ఉండదని, రాజీనామాలు చేసి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి అందరం కలిసి కేంద్రంపై పోరాటం చేద్దామన్నారు. రాజీనామాలు అంటే చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో మీ మంత్రులు, ఎంపీలంతా వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారని, సభ నిరవధిక వాయిదా అనంతరం స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు కూడా కలిసివస్తే ఉప ఎన్నికలకు వెళ్లి ప్రత్యేక హోదా సంజీవని అని ప్రజల అభిప్రాయం కేంద్రానికి తెలిసేలా చేద్దామన్నారు. 

ధైర్యంగా ముందుకొచ్చి సీబీఐ ఎంక్వైరీ వేసుకోండి

సచ్చీలుడినని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఔటర్‌ రింగ్‌రోడ్డు, తన కుమారుడు వైయస్‌ జగన్‌పై ఆరోపణలు వస్తే ధైర్యంగా ముందుకు వచ్చి సీబీఐ ఎంక్వైరీ వేసుకున్నారని గుర్తు చేశారు. ఒకవేళ మీపై కేంద్రం కుట్ర చేస్తుందనుకుంటే మీ కుమారుడు లోకేష్‌.. మీపై సీబీఐ ఎంక్వైరీ వేసుకొని తప్పు చేయలేదని నిరూపించుకోండి అని చంద్రబాబుకు సూచించారు. ఇప్పటికే ఐదు సంవత్సరాల కాల పరిమితిలో నాలుగేళ్లు గడిచిపోయిందని, మిగిలిన సంవత్సరంలో ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివచ్చి హోదా ఇస్తుందని వైయస్‌ఆర్‌సీపీ గట్టిగా నమ్ముతుందని, రాజీనామాలు చేయకపోతే ప్రజలకు, రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిగా మిగిలిపోతారని సూచించారు. 
 

తాజా వీడియోలు

Back to Top