'జనం కోరుకునే నాయకుడు జగన్‌ ఒక్కడే'

కర్నూలు, 21 నవంబర్‌ 2012: షర్మిల మరో ప్రజాప్రస్థానానికి, చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రకు చాలా తేడా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభివర్ణించారు. చంద్రబాబు తపస్సు చేసినా ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు మాత్రమే నాయకులు, ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ చుట్టూ తిరుగుతారని, అధికారం కోల్పోయిన వెంటనే దాన్ని పట్టించుకునే నాథుడే ఉండడని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల్లో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ప్రజల్లో గాని, నాయకులలో గాని చంద్రబాబు పట్ట నమ్మకం లేదన్నారు. పాపం చంద్రబాబు దురదృష్టం ఆయన ఎంతగా తపస్సు చేసిన ఈ రాష్ట్ర ప్రజలు నమ్మబోరన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో 35వ రోజు బుధవారంనాడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నడుస్తూనే మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

తమకు కావాల్సిన నాయకుడు తమను పరిపాలించాలని, ఆ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిపోయిన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా కాలవ్యవధి ఉంది కాబట్టి ఏదో విధంగా నడుపుకుంటున్నారని ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. అంతకు మించి ఏమీ లేదన్నారు. ఈ ప్రభుత్వం ఉంది ప్రజలకు కష్టాలు వస్తే ఆదుకుంటుందన్న భరోసాయే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

షర్మిల అడుగు పెట్టిన ప్రతిచోటా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలికారని, తమ సమస్యలు చెప్పుకున్నారని, ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారని కోట్ల హరి చక్రపాణిరెడ్డి చెప్పారు. రైతు కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద సరైన పనులు లేక వలసలు పోతున్నట్లు షర్మిలకు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు సాగు, తాగునీటి పథకాలపై షర్మిల ఆరా తీశారని గౌరు వెంకటరెడ్డి తెలిపారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాయలసీమలోని ప్రాజెక్టులను పట్టించుకున్న వారే లేరని గౌరు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఉన్నప్పుడు రెండు పంటలకు నీళ్ళు అందించేవారన్నారు. ఆయన తరువాత ఒక్క పంటకు కూడా సాగునీరు అందని దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top