<strong>ఇడుపులపాయ, 18 అక్టోబర్ 2012:</strong> ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు నిరసనగా తాను నల్లబ్యాడ్జి పెట్టుకుని మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైయస్ అభిమానులు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జగనన్న జైలు నుంచి బయటికి వచ్చేవరకూ నల్లబ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలియజేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించాయని దుయ్యబట్టారు. సిబిఐని వాడుకుంటూ జగన్మోహన్‌రెడ్డిపై ఆ పార్టీలు కక్ష సాధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఈ పాదయాత్ర జగనన్న చేయాల్సి ఉంది. ఆయన వస్తే మనందరికీ సంతోషంగా ఉండేది అని షర్మిల ఉద్వేగంగా తెలిపారు. జగనన్న ఆశీస్సులతో మీ ప్రేమను పొందేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభిస్తున్నానని ఆమె ప్రకటించారు.