జగనన్న వస్తే అందరికీ ఉచిత విద్య

మూలమల్ల (మహబూబ్ నగర్ జిల్లా), 30 నవంబర్ 2012:

 ప్రస్తుతం రాష్ర్టంలో కొనసాగుతున్నది రాబంధుల ప్రభుత్వమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాలను నీరుగార్చి పేద ప్రజల నోటికాడి ముద్దను తన్నుకు పోతోందని దుయ్యబట్టారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆ రోజులు మళ్లీ వస్తాయని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

       శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చి రాజన్న రాజ్యం తీసుకు వస్తారని శ్రీమతి షర్మిల ధీమా వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే అందరికీ ఉచిత విద్య కల్పించడంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తారని ఆమె హామీ ఇచ్చారు.

       'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా శుక్రవారం పాలమూరు జిల్లాలోని మూలమల్ల గ్రామంలో శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్శహించారు. మహానేత మరణానంతరం పింఛన్లు, ఫీజులు, రుణాలు అందడంలేదని ప్రజలు తమ కష్టాలను శ్రీమతి షర్మిలతో పంచుకున్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు అన్నారు.

      గ్రామంలో తాగు నీటి కోరత ఉన్నా ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపించారు.  డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫీజులు చెల్లించకుండానే తాము ఉన్నత విద్యలు అభ్యసించామని కొందరు విద్యార్థులు రచ్చబండ కార్యక్రమంలో చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు తామే చెల్లిస్తున్నామని అన్నారు. దాంతో ఆ ఫీజులు కట్టలేక కొందరు చదువులు మానేసి కూలి పనులకు వెళుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

     పావలా వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట తప్పారని గ్రామస్తులు అన్నారు. ఇపుడు అసలు రుణాలే ఇవ్వడంలేదని పలువురు గ్రామస్తులు రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు. గామ్రస్తుల కష్టాలు విన్నశ్రీమతి షర్మిల మాట్టాడుతూ, మీరందరూ జగనన్న అండగా నిలవాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మీ కష్టాలన్నీ తీరుతాయని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

Back to Top