తుపాను విధ్వంస ప్రాంతాల్లో జగన్ పర్యటన

హైదరాబాద్, అక్టోబర్ 13: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నుంచి ఉత్తరాంధ్రలో తుపాను విధ్వంస ప్రాంతాలను సందర్శించి సహాయ, పునరావాస కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో సంభవించిన ప్రకృతి విలయం కారణంగా ఈనెల 16 నుంచి నిర్వహించ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

శ్రీ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం బయల్దేరి విమానంలో రాజమండ్రి వెళతారు. అక్కడి నుంచి అందుబాటులో ఉన్న రవాణా సదుపాయం ద్వారా తుపాను విధ్వంసానికి గురైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పర్యటిస్తారు. ఆయన అక్కడే ఉండి మూడు జిల్లాలలో కొనసాగే సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. తుపాను విధ్వంసంతో నష్టపోయిన కుటుంబాలను పరామర్శిస్తూ వారికి తక్షణ సహాయం అందేలా చూస్తారు అని పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు సోమవారం ఇక్కడ పార్టీ ప్రధాన కార్యలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

హుదూద్ తుపాను కనీవినీ ఎరుగనంతటి విధ్వంసాన్ని సృష్టించిన నేపథ్యంలో బాధిత ప్రజలను కలుసుకుని వారికి తక్షణమే సహాయం అందేలా చూడాలని శ్రీ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తుపాను ధాటికి రైతులు, నేతన్నలు, చిన్నపాటి వర్తకులు ఇంకా సమాజంలోని అనేక వర్గాలు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఆదివారం తీరం దాటిన తుపాను విశాఖపట్నం నగరాన్ని అతలాకుతలం చేసిందని ధర్మాన చెప్పారు.

విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు శ్రీ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను స్థానిక నాయకులే నిర్వహిస్తారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పర్యటనను రూపొందిస్తారు. శ్రీ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వలన బాధితులకు తక్షణమే సహాయం పొందే అవకాశం ఉంటుందని ధర్మాన తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రేపు విశాఖపట్నం సందర్శిస్తున్నందున ఆయనను శ్రీ జగన్ మోహన్ రెడ్డి కలుసుకుంటారా అన్న ప్రశ్నకు ధర్మాన సమాధానం చెబుతూ అప్పటి పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అయితే తుపాను ధాటికి గురైన ప్రాంతాలలో విలవిలలాడిపోతున్న ప్రజలకు చేయూత అందించడమే తమ పార్టీ తక్షణ కర్తవ్యం అని ధర్మాన స్పష్టం చేశారు.

తుపాను కారణంగా రుణ మాఫీపై తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తమ పార్టీ ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ధర్మాన తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top