అసెంబ్లీ తక్షణ సమావేశానికి ఆదేశించాలి

హైదరాబాద్ 17 అక్టోబర్ 2013:

రాష్ట్ర విభజనపై చర్చించడానికి డ్రాఫ్టు బిల్లు అసెంబ్లీకి వచ్చేలోగా శాసన సభను ప్రత్యేకంగా సమావేశ పరచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. భవిష్య తరాల ప్రయోజనాలను కాపాడడానికి వీలుగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని గవర్నరుకు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు రాజ్ భవన్‌లో గవర్నరు నరసింహన్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

గవర్నరుకు అందించిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది..

శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ గారికి,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్,
రాజ్ భవన్
హైదరాబాద్


రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, తెలంగాణ డ్రాఫ్టు బిల్లు రాష్ట్రానికి వచ్చేలోగా సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. రాష్ట్రంలో భవిష్య తరాల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా ఆంధ్ర ప్రదేశ్ విభజనను నిరసిస్తూ ఓ తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టాలి.

కిందటి నెల 30వ తేదీన మీకు ఇదే అంశంపై వినతి పత్రాన్ని సమర్పిస్తూ, క్యాబినెట్ నోట్‌కు ముందే అసెంబ్లీని సమావేశపరిచేలా చొరవ చూపించిన విషయాన్ని ఇక్కడ మరోసారి ప్రస్తావిస్తున్నాం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటైతే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పార్టీలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశమే కాకుండా, వైఖరిని కూడా తెలియజేసేందుకు వీలుంటుంది.  నిరంకుశంగా చేసిన విభజన ప్రక్రియను నిలుపుచేయడానికి అనువుగా సమైక్య తీర్మానం చేసే అవకాశం లభిస్తుంది.

ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సెప్టెంబర్ 26న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా లేఖ రాశాం. కానీ దురదృష్టవశాత్తూ తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
తెలంగాణ అంశంపై క్యాబినెట్ నోట్‌ను ఆమోదించి, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి విభజన ప్రక్రియను కేంద్రం వేగిర పరిచింది. బృందం తన మొదటి సమావేశంలోనే ప్రజాభీష్మాన్ని విస్మరించి, రాష్ట్రాన్ని చీల్చేందుకు కార్యాచరణను రూపొందించేందుకు పూనుకుంది. ఈ నేపథ్యంలో గవర్నరు కార్యాలయం జోక్యం చేసుకుని, అసెంబ్లీని సమావేశపరచాలని విజ్ఞప్తి. దీనివల్ల విభజన అంశాన్ని చర్చించి, అందుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించడానికి వీలవుతుంది. డ్రాఫ్టు బిల్లు తయారవడానికి ముందే ఈ తీర్మానాన్ని ఆమోదించడం ఎంతైనా అవసరం.

అసెంబ్లీలో మెజారిటీ ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చేసిన తీర్మానాన్ని గౌరవించాల్సి ఉంటుంది. విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరింత ముందడుగు వేయకుండా అసెంబ్లీని సమావేశపరచాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరింత జాప్యం చేయకుండా విభజనపై మా వ్యతిరేకతను వ్యక్తంచేసి, జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలన్న మా ఆలోచనను దేశం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్సించాలి. అసెంబ్లీ తీర్మానం చేయాలన్న మౌలిక సంప్రదాయాన్ని విస్మరించి, కొన్ని ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనకు పూనుకోవడం సరికాదు.

18మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్న బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగానూ, రాష్ట్రంలోని అరవై శాతం జనాభా గత 70 రోజులుగా తమ నిరసనను వివిధ రూపాలలో వ్యక్తపరుస్తున్న నిరసనలను మీ దృష్టికి తెస్తున్నాం. మీరు జోక్యం చేసుకుని విభజనకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం కల్సించాలని కోరుతున్నాను.  అసెంబ్లీని సమావేశపరిస్తే విభజనకు వ్యతిరేకంగా మా గళాన్ని వినిపించే వీలు దొరుకుతుంది. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నం చేయవచ్చు. తక్షణం అసెంబ్లీని సమావేశపరచాల్సిందిగా ప్రభుత్వాన్ని తమరు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

అభినందనలతో
మీ విశ్వసనీయుడు
(వైయస్ జగన్మోహన్ రెడ్డి)
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

Back to Top