'ఇటుకల పనితో గిట్టుబాటు కావడం లేదక్కా'

మహబూబ్‌నగర్‌ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కొద్దిసేపు ఇటుకల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. ఆ పనిలో ఉన్న కష్టసుఖాలను తయారీదారులు, కూలీలను స్వయంగా ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌ తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల చేస్తున్నారు. పాదయాత్ర 38 రోజున ఆమె శనివారంనాడు మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపురం నియోజకవర్గంలోని 26వ కాల్వ సమీపంలో ఇటుకలు తయారీ కేంద్రంలోకి వెళ్ళారు. అక్కడ కొద్దిసేపు ఇటుకల తయారీ విధానాన్ని శ్రద్ధగా నేర్చుకున్నారు. పనిచేస్తున్నవారితో ఆమె కొద్దిసేపు వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఇటుకల తయారీదారు వడ్డె వెంకటేష్‌ తమ కష్టాలను షర్మిల ముందు ఏకరువు పెట్టాడు. ఇటుకల తయారీలో మూడేళ్ల నుంచీ ఏమీ గిట్టుబాటు లేదక్కా.. అంటూ షర్మిల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. అన్ని రేట్లూ పెరిగినాయన్నాడు. ఇటుకల తయారీలో కూలీ కూడా గిట్టటం లేదన్నాడు. గతంలో రూ.400 ఉన్న టన్ను బూడిద ఇప్పుడు రూ.700, అప్పుడు ట్రాక్టర్ కంకర రూ.8,000 ఉంటే.. ఇప్పుడది రూ.12,000, అప్పుడు రూ.600 ఉన్న ఇసుక రూ.1,200 అయిందని వాపోయాడు. తీరా ఇంత ధర పెట్టి ఇటుకలు తయారుచేస్తే మార్కెట్‌లో కొనేటోళ్లే లేరక్కా అంటూ విచారం వ్యక్తం చేశాడు. 'రైతుల పరిస్థితి బాగా లేదు. మూడేళ్ల నుంచి పంటలు చేతికి అందటం లేదు. రైతు చేతికి పంట వస్తే ఇళ్లు కట్టుకుంటడు. అప్పుడు మాకు కూడా గిరాకీ ఉంటుంది. వాళ్లే అల్లాడిపోతుంటే ఇక మా దిక్కు ఎవరు చూస్తరు చెప్పక్కా..’ అంటూ వెంకటేష్ షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ దేశానికి అన్నం పెట్టే ‌రైతన్న బాగుపడాలంటే జగనన్నే సీఎం కావాలని వెంకటేష్‌ అన్నాడు. త్వరలోనే జగనన్న బయటకు వస్తాడని, రాజన్న రాజ్యం తెస్తాడని షర్మిల అతనికి ధైర్యం చెప్పారు.

స్థానికుల బాధలు విన్న షర్మిల మాట్లాడుతూ, ‘మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన ఏడాది కృష్ణా, తుంగభద్ర నదులు పొంగి ఇళ్లు మునిగిపోయాయి. ప‌రీవాహక ప్రాంతంలోని ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ముంపునకు గురైన వాళ్లను పరామర్శించేందుకు అప్పటి సీఎం రోశయ్య ఇక్కడకు వచ్చి ఇళ్లు కోల్పోయిన వారందరికీ వెంటనే కొత్త ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చారు. ఆయన హామీ ఇచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ముంపు బాధితులకు కనీసం ఇళ్లు కాదు కదా.. గుడిసె కూడా వేయించలేదు. ఆ వేళ ప్రాణాలు అరచేతుల్లో పెట్టికొని బతికిబయటపడ్డ వాళ్లంతా ఎక్కడో ఒక చోట గుడారాలు వేసుకొని బతుకుతున్నారు. మూడేళ్లుగా నరకం చూస్తున్నారు. వాళ్లుంటున్న ప్రాంతం సురక్షితం కాదు. పాములు, విషపు పురుగులు చుట్టూ తిరుగుతున్నా వాటి మధ్యే ప్రాణాలు అరచేత పట్టుకుని కాపురాలు చేస్తున్నారు. అయ్యా..! కాంగ్రెస్ పాలకులారా... ఆ వేళ రోశయ్య ఇచ్చిన మాట ఏమయింది?’ అని‌ షర్మిల ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top