మళ్లీ మీ చేతుల్లో పెడుతున్నా కాపాడుకోండిచేతులెత్తి మొక్కుతున్నా.. నా కడుపు మీద కొట్టొద్దుభావోద్వేగంతో వైయస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ
హైదరాబాద్: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడు చెప్పేవారు. మొదలుపెట్టిన పని మధ్యలో ఆపకూడదు. అది నాయకుడి లక్షణం కాదని చెప్పేవారు. వైయస్ జగన్ కూడా అదే లక్షణం కలిగిన వాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. ‘నాన్న నన్ను ఒంటిరి చేయలేదు. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని వైయస్ జగన్ పదే పదే చెబుతుంటారు. విశాఖ ఎయిర్‌పోర్టులో నా బిడ్డపై హత్యాయత్నం జరిగింది. దేవుడి దయతో ఆ కత్తి గొంతులో కాకుండా భుజానికి దిగింది. ఇది నా బిడ్డకు పునర్జన్మ. జగన్ మళ్లీ జనం కోసం వెళ్తున్నాడు. ఏడేళ్ల క్రితం ఏ విధంగా నా బిడ్డను ఏ విధంగా ప్రజలకు అప్పగించానో.. మళ్లీ ఈ రోజు అప్పగిస్తున్నా. రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నా.. నా బిడ్డను కాపాడుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే హత్యాయత్నం చేయించారో వారికి కూడా రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నా.. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేయొద్దు. వైయస్‌ఆర్‌ను కోల్పోయి నేను నా కుటుంబం ఇంకా తేరుకోలేదు. మళ్లీ నా కడుపు మీద కొట్టొద్దు. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదు అనుకుంటుంది అలా హత్యాయత్నం చేయించినవారు అనుకోకండి ప్రతి మాటకు దేవుడి దగ్గర అకౌంటబుల్ అనేది మర్చిపోవద్దు.