ఇడుపులపాయ: మహానేత కటౌట్లతో ఇడుపులపాయ కొత్త అందాన్ని సంతరించుకుంది. యోగా భంగిమలో ఒకటి.. చిరునవ్వులు చిందిస్తూ మరొకటి.. చేయెత్తి అభివాదం చేస్తూ మరొకటి ఇలా వివిధ భంగిమలలో ఏర్పాటైన డాక్టర్ వైయస్ఆర్ చిత్రాలు మరో ప్రజాప్రస్థాన సభకు విచ్చేసిన ఆయన అభిమానులను ఆప్యాయంగా పలుకరిస్తున్నాయన్నట్లుగా ఉన్నాయి. నింగినుంచి రాజన్న చిందిస్తున్న చిరునవ్వులకు ప్రతీకగా నిలిచాయి. అశేష జనవాహినికి అభివాదం చేస్తున్నట్లుగా వాటిని నెలకొల్పారు. షర్మిల పాదయాత్రకు విచ్చేసిన వారు ఆ చిత్రాల ఛాయలో నడుస్తూ.. మహానేత ఆశీస్సులు అందుకున్నట్లు భావించారు.
సభాస్థలికి చేరుకోవడానికి రోడ్డుపై చోటుచాలక.. పొలాల మధ్యనుంచి పరుగులు తీయడం కనిపించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ రావడమూ కనిపించింది.
ఇడుపులపాయ వైయస్ఆర్ ఘాట్‌లో ఓ బాలుడు అందరినీ ఆకర్షించాడు. మహానేత మాదిరిగా ఆహార్యాన్ని ధరించిన ఆ బుడతడు పొలాల్లో వైయస్ఆర్ లాగే కుడిచేతిని ఊపుతూ ముందుకు సాగాడు. సభా స్థలికి వచ్చిన వారు అతనిని ఆసక్తిగా గమనించారు.