ఇది కాంగ్రెస్, టీడీపీల కుర్చీలాట

కూడేరు:

కాంగ్రెస్, టీడీపీలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి మరోసారి నిప్పులు కురిపించారు. బుధవారం కూడేరులో వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ  జనం సమస్యలతో తల్లడిల్లుతుంటే పాలక కాంగ్రెస్ పార్టీ కుర్చీలాట ఆడుతోందని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన టీడీపీ అధినేత పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారని మండిపడ్డారు.  'చంద్రబాబు హయాంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే.. ఇప్పుడు పాదయాత్రలో గ్రామాల్లో ప్రజల కాళ్లు, చేతులు పట్టుకున్నా చంద్రబాబు చేసిన పాపం పోదు.. కుర్చీ కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారు. కుమ్మక్కు రాజకీయాలతో ప్రజాకంటక పాలన సాగిస్తోన్న కాంగ్రెస్‌కూ.. ఆ పార్టీతో కుమ్మక్కైన టీడీపీకి బుద్ధి చెప్పండి' అని షర్మిల పిలుపునిచ్చారు. విశ్వసనీయత, మాట మీద నిలబడే నైజం ఉన్న జగనన్నను ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా ఇచ్చారు. వైయస్ ఇచ్చిన ప్రతి మాటనూ జగనన్న నెరవేస్తారన్నారు. ఇక్కడే షర్మిల ఓ బాలుడికి రాజశేఖర్ అని పేరు పెట్టారు. కూడేరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత ముద్దలాపురం సమీపంలో రోడ్డు పక్కన వేసిన గుడారాల వద్దకు రాత్రి 7.10 గంటలకు చేరుకున్న షర్మిల పాదయాత్రను ముగించి.. అక్కడే బసచేశారు.
సేద్యానికి ఉచిత విద్యుత్ ఎక్కడ?
అరవకూరు నుంచి కూడేరుకు చేరుకునే క్రమంలో మార్గమధ్యలో 12.40 గంటలకు భోజనం చేసిన షర్మిల, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నాలుగు గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. అదే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న చీనీ తోటలోకి వెళ్లారు. రైతు గాంగేనాయక్‌ను పంట పరిస్థితిపై ఆరాతీశారు. ‘అమ్మా.. కరెంట్ కోతల వల్ల చీనీ చెట్లకు సరిగ్గా నీళ్లు పెట్టలేకపోతున్నా. సేద్యానికి ఉచిత విద్యుత్ అంటోన్న ప్రభుత్వం మరో వైపు రూ.20 వేల బిల్లు కట్టాలని నోటీసులు ఇచ్చింది. తక్షణమే రూ.20 వేలు కట్టాలని అధికారులు వేధిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా అధికారులు వచ్చి నన్ను వేధించారు’ అంటూ వాపోయారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘ఇదీ ఈ సర్కారు పనితీరు. ఉచిత విద్యుత్ అంటూ ఈ ప్రభుత్వం బిల్లులు వసూలు చేస్తోంది.
బిల్లులు కడతావా విద్యుత్ తీగలను కత్తిరించాలా అని వేధిస్తుంటే రైతులు ఎలా కట్టగలరు.. చంద్రబాబు హయాంలో ఇలా చేయడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. అన్నా.. అధైర్యపడొద్దు.. మన రాజన్న రాజ్యం వస్తుంది.. సేద్యానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తుంది’ అంటూ ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి కూడేరుకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి మహానేత వైయస్ సర్కిల్‌కు చేరుకునే వరకూ షర్మిలపై బంతిపూల వర్షం కురిపించి.. అభిమానాన్ని చాటుకున్నారు. లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యం చేసి.. షర్మిలకు ఘన స్వాగతం పలికారు.

Back to Top