ఇది దుర్మార్గపు ప్రభుత్వం!


హెచ్.మార్వాని

(కర్నూలు జిల్లా) 16 నవంబర్ 2012 : రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన సాగుతోందని షర్మిల దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కోసమేననీ, వీళ్లకు పేదల పక్షాన నిలవాలని ఏ కోశానా లేదనీ ఆమె విమర్శించారు. 30వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం కర్నూలు జిల్లా హెచ్.మార్వాని వద్ద మహిళలతో రచ్చబండ సమావేశం నిర్వహించారు. పెన్షన్లు, కరెంటు కోతల వంటి సమస్యలను వారు షర్మిలకు వివరించారు. ఒక వృద్ధురాలు తనకు పెన్షన్‌లో కోత పెడుతున్నారని చెప్పగా షర్మిల స్పందిస్తూ ఇది దుర్మార్గపు పరిపాలన అని విమర్శించారు.
"ఈ అవ్వకు 90 ఏళ్ల వయసు ఉంటుంది. కానీ ఒక సంవత్సరం నుండి ఈ అవ్వకు పెన్షన్‌లో కటింగ్ చేస్తున్నారంట. దుర్మార్గపు పరిపాలన అని అనడానికిది మంచి నిదర్శనం. ఈ వయసులో కూడా అడగడానికి వెళుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదంట. దీనిని చూస్తే ఇది దుర్మార్గపు ప్రభుత్వమో అర్థమౌతోంది" అని షర్మిల మండిపడ్డారు. "ధైర్యంగా ఉండండి, కొంచెం ఓపిక పట్టండి,  రాజన్నరాజ్యం తొందరలో వస్తుంది. అప్పుడు మీరు ఏడువందలు పెన్షన్ ఇస్తారు" అని ఆమె వారికి భరోసా ఇచ్చారు.
తమ ఊరికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదనీ, అధికారపార్టీ నేతలే తింటున్నారనీ మహిళలు షర్మిలకు ఫిర్యాదు చేశారు. "కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం మటుకే. వాళ్ల పనులు చేయించుకోవడానికి మాత్రమే. పేదవాడి పక్షాన నిలబడదామని వీళ్లకి ఏ కోశానా లేదు." అని షర్మిల విమర్శించారు. "రుణాలు రావు, ఇళ్లు రావు. ఏదీ రావడం లేదు" అని ఆమె నిందించారు.
తమ చేనుకు రోజులో కేవలం గంట మాత్రమే కరెంటు ఇస్తున్నారని ఒక మహిళ షర్మిలతో వాపోయింది. దీనికి స్పందిస్తూ, "రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు ఉచిత విద్యుత్తు ఏడు గంటలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం రెండు గంటలు కూడా ఇవ్వడం లేదు" అని షర్మిల విమర్శించారు. బోర్లకి కూడా కరెంటు లేకపోవడంతో బోర్ల నుండి కూడా తాగునీరు తీసుకోలేకపోతున్నారన్నారు.
స్టోరు బియ్యం కూడా సరిగ్గా రావడం లేదని మహిళలు ఫిర్యాదు చేశారు. చక్కెర, మంచినూనె ధరలు పెరిగాయన్నారు. దీనికి స్పందించిన షర్మిల "రాజశేఖర్ రెడ్డిగారు ఉండివుంటే మీకు 30 కిలోల బియ్యం వచ్చేది. తొమ్మిది కిలోల బియ్యం వచ్చేది" అన్నారు. రెండు గంటల కరెంటుకు నాలుగింతల బిల్లులు సర్‌చార్జ్‌ల రూపంలో వసూలు చేస్తున్నారని మహిళలు వాపోయారు.
జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు, రైతులకు వడ్డీ లేకుండానే రుణాలిస్తారని షర్మిల హామీ ఇచ్చారు. అలాగే పిల్లలను చదివించుకోవడానికి 'అమ్మఒడి' పథకాన్ని కూడా ప్రవేశపెడతారన్నారు.

Back to Top