ఇది 'ధరకాసుర' పాలన

హైదరాబాద్ 11 ఏప్రిల్ 2013 : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని 'ధరకాసుర' పాలనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం అభివర్ణించింది. అన్ని నిత్యావసరాల ధరలను ప్రభుత్వం 500 శాతం మేరకు పెంచిదని వైయస్ఆర్ సీపీ శాసనసభాపక్షం డిప్యూటీ ప్లోర్ లీడర్లు భూమా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత మండిపడ్డారు. కరెంటు చార్జీలతో పాటు అన్ని చార్జీల పెరుగుదల నుండి ప్రజల దృష్టిని మళ్లించి వారిని మభ్య పెట్టేందుకే 'అమ్మహస్తం' పథకం ప్రవేశపెట్టారని వారు గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల కారణంగా 'ధరకాసుర' పాలన హయాంలో పేదప్రజలకు పచ్చడి మెతుకులు కూడా కరువై పోతున్నాయని వారు విమర్శించారు. ఒకవైపు 500 శాతం నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన ఘనత వహించిన ధరకాసుర పాలనలో అమ్మహస్తం పథకం ద్వారా 37 శాతం ప్రజలకు ఆదా అవుతుందని ప్రకటించడం విడ్డూరంగా ఉండని వారు ఆక్షేపించారు. గతంలో రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసే సరుకుల్లో కోత పెట్టి వాటి స్థానంలో మరికొన్ని చేర్చి ప్రజలకు తామెంతో మేలు చేస్తున్నామని, అందుకే అమ్మహస్తం పథకం ప్రవేశపెట్టామనీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించడం హాస్యాస్పదమని వారు వ్యాఖ్యానించారు.

గతంలో తెల్ల రేషన్ కార్డులకు కిలో చక్కెర సరఫరా చేసేవారనీ, దానినిప్పుడు అరకిలోకు కుదించారనీ, 4 లీటర్ల కిరోసిన్ కోటాను 2 లీటర్లకు తగ్గించడంతో పాటు రేటు కూడా పెంచారనీ వారు గుర్తు చేశారు. ఈ కోతలు, రేట్ల పెంపుపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2009 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా బియ్యం కోటాను పెంచాలని వారు కోరారు.  ప్రభుత్వం ప్రకటించిన బహిరంగ మార్కెట్ ధరలు కూడా తప్పుల తడకగా ఉన్నాయనీ, ఆ ధరలు వాస్తవమైతే వారికి దమ్మూ ధైర్యమూ ఉంటే బహిరంగ చర్చకు రావాలని వారు సవాలు చేశారు.

ఈ ధరకాసుర పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని వారు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వివిధ నిత్యావసర సరుకుల ధరల పట్టికను వారు విడుదల చేశారు.
Back to Top