విభజన ప్రక్రియను ఆపండి: విజయమ్మ

ఆంధ్ర ప్రదేశ్ విభజనకు సంబంధించి ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆమె న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ పత్రం పూర్తి పాఠం ఇలా ఉంది..

గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారికి,
ఆర్యా!

2013 ఆగస్టు 10న రాసిన బహిరంగ లేఖను ప్రస్తావిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర విభన ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఙప్తిచేస్తున్నాను. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని సమస్యలకు పరిష్కారాన్ని చూపేవరకూ ఈ చర్య తీసుకోవాలి. ఆంధ్ర ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. జన జీవనం స్థంభించింది. రాష్ట్ర విభజనలో ఏకపక్ష, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆ ప్రాంత ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఎనిమిదిన్నర కోట్ల జనాభా కలిగిన అతి పెద్ద రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌ను కారణంలేకుండా విభజించడం పరిస్థితిని క్లిష్టతరం చేసింది. భాషా ప్రయుక్తంగా ఏర్పాటైన రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ మొదటిదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాను. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారిని విశ్వాసంలోకి తీసుకోకుండా అన్యాయం జరిగేలా ఉంటే విభజనపై ముందుకు వెళ్లకూడదని విజ్ఞప్తిచేస్తున్నాను.


గూర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, విదర్భ, హరితప్రదేశ్ వంటి మిగిలిన డిమాండ్లను, రెండో ఎస్సీర్సీ వేస్తామన్న 2001నాటి వాగ్దానాన్ని పక్కనపెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా విభజించడం తగదు. వాటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలిక కూడా లేదు.

హైదరాబాద్ రాజకీయ రాజధానిగానే కాక, అత్యంత శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. జీడీపీలో 75%, సాఫ్టువేర్ కార్యకలాపాల్లో 95% ఇక్కడినుంచే సాగుతున్నాయి. ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన శాలలు కూడా ఇక్కడే ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన 40శాతం ఆదాయాన్ని హెచ్ఎమ్‌డీఏ పరిథినుంచే వస్తోంది. ప్రభుత్వాలు కేవలం హెచ్ఎమ్‌డీఏ పరిథిలోనే పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి. మిగిలిన జిల్లాలలో  ఇక్కడికంటే మెరుగైన సౌకర్యాలున్నప్పటికీ వాటివైపు ప్రభుత్వాలు కన్నెత్తిచూడలేదు. మిగిలిన రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో సమానంగా అభివృద్ధి చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దీని హెచ్ఎమ్‌డీఏ పరిథిలోనే ఉండడంతో అనుబంధ పరిశ్రమలు కూడా సహజంగానే ఆ పరిసరాలలోనే నెలకొల్పారు. ఇప్పుడవి ఎంతో ఉన్నతిని సాధించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. ఎందుకంటే అది మన రాజధాని కాబట్టి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీస్తే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈ పెట్టుబడులన్నీ ఏమవుతాయి? ఈ పరిశ్రమలన్నింటినీ ఇక్కడినుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలించడం సాధ్యమయ్యేపనేనా? హైదరాబాద్ మాదిరిగానే ఆంధ్ర ప్రాంతంలో ఆర్థిక, పారిశ్రామిక వనరులను సృష్టించుకోవడానికి ఎంత సమయం పడుతుంది. ఆంధ్ర ప్రాంతానికి వాటిల్లే ఆదాయ నష్టాన్ని కేంద్రం ఎలా పూడుస్తుంది. హైదరాబాద్ పరిథిలో ఉన్న సంస్థలన్నీ ఆంధ్ర ప్రాంతంలో నెలకొనేలా కేంద్రం చర్యలు తీసుకోగలదా..
సాగు నీటి ప్రాజెక్టులు, జల పంపిణీ పరిస్థితి ఏమవుతుంది. ఇప్పటికీ రాష్ట్రాల్లో 62శాతం వ్యవసాయంపైనే ఆధారపడిఉన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా నదులపై బ్రిటిష్ ప్రభుత్వం 1850లోనే నాలుగు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించింది. స్వాతంత్ర్యానంతరం నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులను ఆంధ్ర ప్రదేశ్ నిర్మించుకుంది. వీటిలో ఆంధ్ర, తెలంగాణాల వాటా ఎంతనేది ముందుగానే నిర్ణయించుకుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ నీటి విడుదల సాఫీగా సాగిపోతోంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను, ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం పక్కన పెట్టి ఎగువ రాష్ట్రాలు నిర్ణీత పరిమాణంలో నీటిని ఇప్పటికే విడుదల చేయడం లేదు. మరో రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాజెక్టులు మరింత కష్టాల్లో కూరుకుపోతాయి. తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు విడుదల కాక రాయలసీమ ప్రాంతం ఎలా ఇబ్బందిపడుతోందో కళ్ళారా చూస్తున్నాం. కేటాయించిన దానిలో కేవలం 60 శాతం మాత్రమే విడుదలవుతోంది. కొత్త రాష్ట్ర ఏర్పాటువల్ల ఈ సమస్యలు రెట్టింపవుతాయి. ఆంధ్ర ప్రాంతానికి ఉప్పునీరే గతవుతుంది. 1959లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది పరిష్కరాం కాకపోతే పోలవరం ప్రాజెక్టుకు చాలినంత నీరొస్తుందని కేంద్ర జల వనరుల మండలి ఎలా భావిస్తుంది.


ఈ ముఖ్యమైన అంశాలకు పరిష్కారాన్ని కనుగొనకుండా రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్ర ప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తుంది.  2012 డిసెంబరు 28న ఏర్పాటైన అఖిల పక్ష సమావేశంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించింది.
 

కేంద్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా న్యాయం చేస్తారు.. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే ముఖ్య అంశాలను ఎలా పరిష్కరిస్తారు, రాజధాని ఏర్పాటు, మౌలికవసతుల కల్పన వంటి అంశాలను ప్రస్తావిస్తారని ప్రజలు భావించారు. కానీ ఎటువంటి అంశాన్నీ ప్రస్తావించకుండానే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా విడదీస్తామని కాంగ్రెస్ ప్రకటించడం  శరాఘాతంలా పరిణమించింది. 57 సంవత్సరాలుగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలు హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా జీవిస్తున్న విషయాన్ని గమనించాలి. స్టేక్ హోల్డర్సును సంప్రతించకుండా నేరుగా కేంద్ర కేబినెట్ కు నివేదించడం శోచనీయం. ఇది చాలా దురదృష్టకరం.

రాజకీయ ప్రయోజనాల కోసమే అంటే రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే పది లేదా 15 లోక్ సభ ఎంపీల సీట్లకోసమే కాంగ్రెస్ తెలంగాణను విడదీసింది. దీనికి నిరసనగా తమ ఎమ్మెల్యేలు పదహారు మంది రాజీనామాలు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా సమస్యలకు పరిష్కారాలు సూచించకుండానే తెలంగాణ ఏర్పాటుకు నడుంబిగించింది.
రాష్ట్ర విభజన చేస్తామన్ని సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం అన్ని సమస్యలను పరిష్కరించిన తరవాతనే ముందుకు వెళ్ళాలని వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశాలను పరిశీలించడానికి అన్ని వర్గాలతో అత్యున్నత కమిటీని నియమిస్తారని భావించాం. కానీ కాంగ్రెస్ తన  పార్టీకే చెందిన ఎ.కె. ఆంటోని నేతృత్వంలో కమిటీని వేయడం బాధించింది. దీనిని నిరసిస్తూ తానూ, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ, ఎంఎల్ఏ పదవులకు రాజీనామా చేశాం. ప్రజలకు న్యాయం జరిగేందుకు పోరాడాలని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ నిర్ణయం వల్ల ఎదురయ్యే విపరిణామాలను వివరిస్తూ మీకు బహిరంగ లేఖను కూడా రాశాం. ఆ కాపీని మీకు అందిస్తున్నాం. మా పార్టీ ఎమ్మెల్యేలు, నేను కూడా నిరవధిక దీక్షకు పూనుకున్నాం. కానీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా మా ప్రయత్నాన్ని విఫలం చేసింది. ప్రస్తుతం మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి క్రమేపీ చేయిదాటుతోందని విన్నవిస్తున్నాం. పరిపాలన పూర్తిగా స్థంభించింది. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బదులకు లోనవుతున్నారు.

ఈ పరిణామాల దృష్ట్యా తమరు జోక్యం చేసుకుని తగిన చర్యలు చేపట్టి, పరిస్థితిని చక్కదిద్దాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవిస్తున్నాం. న్యాయం చేయలేకపోతే.. ఆంధ్ర ప్రదేశ్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుతున్నాం.

అభినందనలతో

మీ భవదీయురాలు
శ్రీమతి వైయస్ విజయమ్మ

తాజా వీడియోలు

Back to Top