తంబాపురం (అనంతపురం జిల్లా), 25 అక్టోబర్ 2012: రాజస్థాన్ తరువాత దేశంలోనే అతి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం అనంతపురం అని, రాష్ట్ర చరిత్రలో అనంతపురం ఎన్నో కరవు కాటకాలను ఎదర్కొందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జలయజ్ఞంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మేలు చేయాలనుకున్నారు. ఇక్కడ సాగు, తాగు నీరు ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేయకపోతే అనంతపురం జిల్లాలో మనిషన్నవాడే బ్రతికే వీలుండదని ఆయన భావించారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని, సాగు, తాగు నీటికి లోటు ఉండరాదని వైయస్ రాజశేఖరరెడ్డి అనుక్షణం తపించారన్నారు. తొమ్మిదేళ్ళ పాలనలో చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల కోసం పది వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. వైయస్ హయాంలోని ఐదేళ్ళ పాలనలో 50 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేశారన్నారు. అది రాజశేఖరరెడ్డికి ఉన్న దూరదృష్టి. అది ఆయనకు వ్యవసాయం మీద ఉన్న శ్రద్ధ అని అన్నారు. ఈ ప్రాంతానికి హంద్రీ నీవా పథకం రావాలని వైయస్ ఎన్నో కలలు కన్నారన్నారు.
హంద్రీ - నీవా పథకానికి రెండు సార్లు శిలా ఫలకం వేసి, చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశారని షర్మిల దుయ్యబట్టారు. గురువారం మధ్యాహ్నానికి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అనంతపురం జిల్లాలోని తంబాపురం చేరుకుంది. ఈ సందర్భంగా హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. షర్మిల పాదయాత్రకు స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. చంద్రబాబు తరువాత అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హంద్రీ- నీవా పథకాన్ని 70 శాతం పూర్తిచేశారని షర్మిల తెలిపారు. మిగతా 30 శాతం పనులను ప్రస్తుత ప్రభుత్వం ఈ మూడేళ్ళుగా ఒక్క రాయి తీసి ఒక్కడిది అక్కడ పెట్టలేదని విమర్శించారు. కేవలం 45 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే హంద్రీ నీవా పథకం మొదటి ఫేజ్ పూర్తవుతుందన్నారు. ఈ పథకం పూర్తయితే అనంతపురం జిల్లా ప్రజలు ఎంత బాగుంగారో ఉంటారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. పెన్నా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు పది టిఎంసిల నీళ్ళు తప్పకుండా ఇవ్వాలని వైయస్ ఉత్తర్వులు జారీ చేశారు కూడా అన్నారు. ఆయన ఉన్నప్పుడు రెండుసార్లు ఇచ్చారు కూడా అని తెలిపారు. అప్పుడు మీ చెరువులకు నీళ్ళు వచ్చాయా? లేదా? అని ప్రజలను అడిగారు. ఇప్పుడు వస్తున్నాయా? అన్నారు. అనంతపురం జిల్లా ప్రజలు ఇంతగా బాధలు పడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని దుయ్యబట్టారు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు ఎవరో తెలుసా? అని ప్రజలను ప్రశ్నించిన షర్మిల.. చంద్రబాబు నాయుడే అన్నారు. తాను రాసుకున్న 'మనసులో మాట' పుస్తకంలో వ్యవసాయం దండగ అని, ప్రాజెక్టులు కడితే నష్టం అని చంద్రబాబు రైతన్నను నిర్లక్ష్యం చేశారని గుర్తుచేశారు. రైతు పక్షపాతి అని ధైర్యంగా చెప్పుకున్న నాయకుడు ఒక్క వైయస్ మాత్రమే అని షర్మిల అభివర్ణించారు. ప్రజలకు ఏదైనా ఉచితంగా ఇస్తే సోమరిపోతులుగా మారతారన్న విషయాన్ని కూడా చంద్రబాబు తన పుస్తకంలో రాసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి చంద్రబాబు విషయాలన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి బాగా నచ్చి చంద్రబాబును ముఖ్య సలహాదారుగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
విద్యుత̴్ సంక్షోభంతో రాష్ట్రం సతమతం అవుతున్నదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు మూడు నాలుగు గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండడంలేదని, దీనితో పొలాలకు నీళ్ళు, తాగేందుకు మంచినీరు రావడం లేదని ఆమె విమర్శించారు. చదువుకుందామంటే అటు కరెంటు, ఇటు ఫీజు రీయింబర్సుమెంట్ లేవని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం నుంచీ పెద్ద చదువుల చదివి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో అవ్వాలని రాజన్న కలగన్నారని తెలిపారు. దానికి ఈ ప్రభుత్వం కత్తెరవేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం భిక్షం వేస్తోందా? అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. పదవిలో ఉన్నా లేకపోయినా అన్నదాతల సంక్షేమం గురంచి ఆలోచించింది వైయస్ ఒక్కరే అన్నారు.
పేదవాడికి కూడా ఉన్నత వైద్యం అందుబాటులోకి రావాలన్న గొప్ప ఆశయంతో స్వయానా వైద్యుడైన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారు. కానీ, ఇప్పటి ప్రభుత్వం మాత్రం పేదలకు కార్పొరేట్ వైద్యానికి అర్హులు కాదన్నట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి ఎందుకు దించేయలేదని షర్మిల నిలదీశారు. ప్రభుత్వాన్ని దించేసే శక్తి లేని తమలాంటి వారు పాదయాత్ర చేస్తే దానికి ఒక అర్థం ఉందన్నారు. ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలన్నది కాంగ్రెస్, టిడిపిలు కుట్ర చేస్తున్నాయన్నారు. జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టి నిర్బంధించారు. ఎనిమిదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎనిమిదిసార్లు చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీలు పెంచారని దుయ్యబట్టారు. మరిచిపోవాలన్నా మరవలేని ఒక సంఘటన గురించి చెబుతానని, హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిన పోలీసులను చంద్రబాబు విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రజల మీద భారం పడకూడదని వైయస్ ఉన్నప్పుడు గ్యాస్ ధర పెరిగినప్పటికీ ఆ భారాన్ని ప్రభుత్వ ఖజానా నుంచే భరించిన విషయాన్ని షర్మిల గుర్తుచేశారు. ఇప్పుడు ఆరు సిలిండర్ల కంటే ఎక్కువ అవసరం లేని వారికి మాత్రమే దీపం పథకం కింద సబ్సిడీ వర్తింప చేస్తామంటున్నారని, ఇది కేవలం గారడీ మాత్రమే అని తూర్పారపట్టారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం చోద్యం చూస్తూ పాదయాత్రలంటూ కొత్త నాటకం మొదలుపెట్టిందని ఆమె ఆరోపించారు.
జగన్మోహన్‌రెడ్డి మా కుటుంబం కన్నా ప్రజల మధ్యనే ఎక్కువ సమయం గడిపారని షర్మిల అన్నారు. ఉదయించే సూర్యుడిని, ప్రజా సేవ కోసం పరితపించే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డిని కూడా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఒక రోజు వస్తుందని, ఆ రోజున జగనన్న మన మధ్యకు వస్తాడని అన్నారు. జగనన్న ఆధ్వర్యంలో రాజన్న రాజ్యం త్వరలోనే వస్తుందని, ఆయన కోటి ఎకరాలకు సాగు నీళ్ళీస్తారన్నారు. ఈ రాష్ట్రంలో గుడెసె అన్నదే లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తారని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేస్తామని జగన్ అన్నారని షర్మిల పేర్కొన్నారు.
రానున్న కాలంలో జైలు నుంచి జగన్ బయటికి వచ్చి ప్రజలకు రాజన్న రాజ్యాన్ని అందించడం ఖాయమని అమె అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముందుండేందుకు నిర్ణయించుకున్న జగనన్నను అణిచివేసేందుకు పాలక, ప్రతిపక్షాలు చేస్తున్నకుట్రలను షర్మిల తీవ్రంగా ఎండగట్టారు. ఈ కుట్రలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.