గ్రామస్థులతో షర్మిల సహపంక్తి భోజనం

జడ్చర్ల:

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర  గురువారం నాటికి 50 రోజులు పూర్తయిన సందర్భంగా గ్రామాల్లోని మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆమె అడుగులో అడుగువేశారు. ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి కష్టాలను తెలుసుకునేందుకు తమ గ్రామాలకు వస్తున్న ఆమెకు సంఘీభావం తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగే ఈ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొని మొదటి నుంచి అడుగులో అడుగు వేస్తూ వచ్చిన వందలాది మందితో తన సంతోషాన్ని పంచుకుంటూ షర్మిల గురువారం రాత్రి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
     కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏనాడూ పట్టించుకోలేదనీ,  రాజన్న రాజ్యం వస్తేనే రైతన్న సుభిక్షంగా ఉంటాడనీ శ్రీమతి షర్మిల గురువారంనాటి యాత్రలో చెప్పారు.  అన్నదాత నష్టపోకుండా వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఇందుకోసం మూడువేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసేందుకు తన అన్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రూపొందించారని చెప్పారు. పాలమూరు జిల్లాలో ఆమె పదిహేను రోజుల పాటు 238 కిలోమీటర్లు నడిచారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని బసచేసిన ప్రాంతంలోనే అంబేద్కర్ చిత్రపటానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించి యాత్ర ప్రారంభించారు. అనంతరం గంగాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గంగాపూర్ గ్రామంలో సీతారెడ్డి, గంగయ్య గారి శంకరయ్య, వెంకటమ్మ అనే పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రతిపక్ష హోదాలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఈ గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సంఘటన మీకు గుర్తుందా? అంటూ గ్రామస్తులను అడిగారు. ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు రావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం అర్హులైన వారికి కూడా బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఏడాది పాటు ఆగితే ఇళ్లు లేని ప్రతిఒక్కరికీ వస్తాయని హామీ ఇచ్చారు.

జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే న్యాయం
     మహానేత వైయస్ హయాంలో మంజూరైన వృద్ధాప్య పింఛన్లు కూడా ప్రస్తుతం చాలా మందికి రావడం లేదని తిరిగి తమ అందరికీ గతంలో మాదిరే పింఛన్లు రావాలంటే జగన్ ముఖ్యమంత్రి అయితేనే న్యాయం జరుగుతుందమ్మా అంటూ వృద్ధులు తమ మనసులోని మాటను బయటపెట్టారు. గోప్లాపూర్ క్రాస్‌రోడ్డు సమీపంలో పత్తి చేనులో ఉన్న రైతుల వద్దకు షర్మిల వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Back to Top