ప్రచార ఆర్భాటం తప్ప పని జరగడం లేదు

హైదరాబాద్, అక్టోబర్ 30: ఉత్తరాంధ్ర తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే కనిపిస్తొంది తప్ప వాస్తవంగా అక్కడ చేస్తున్నదేమి లేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పునరుద్ధరణ చర్యలు బ్రహ్మాండంగా జరిగాయని చంద్రబాబు తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని, అలాగే విశాఖపట్టణం నగరమంతా పోస్టర్లు వేయించుకున్నారని చెప్పారు. కానీ ఇప్పటికీ అక్కడ ప్రజలు, ముఖ్యంగా రైతులు దిక్కుతోచని స్థితిలో బిక్కు బిక్కుమంటూ ఉన్నారని విమర్శించారు.

కొందరు వ్యక్తులకు ముందుగానే శిక్షణ ఇచ్చి వారిని అనుకూల టీవీల ముందు నిలబెట్టి తమను బాగా ఆదుకున్నారని, తుపాను సమయంలో అన్నం పెట్టారని పొగిడించుకుంటున్నారని ఆయన విమర్శించారు. వాస్తవంగా బాధితులైన వారిని తాము తీసుకొస్తామని, వారితో మాట్లాడితే సహాయక చర్యలు ఎలా ఉన్నాయో బయట పడతాయని ధర్మాన అన్నారు.

కరెంటిచ్చామని చెప్పగలరా?

విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పూర్తిగా విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించామని ప్రభుత్వాధికారులు చెప్పగలరా? అని ధర్మాన ప్రశ్నించారు. ఈ మూడు జిల్లాల్లోను ఇప్పటికీ వందలాది గ్రామాలు అంధకారంలో ఉన్నాయని, 2 లక్షలకు పైగా కనెక్షన్లకు విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించలేదని ఆయన అన్నారు. విశాఖలో తానొక రిటైర్డు ఇంజనీర్ ఇంటికెళ్ళి విద్యుత్ సౌకర్యం గురించి ఆరాతీస్తే రోజుకు రెండు మూడు గంటలకన్నా ఎక్కువ సరఫరా లేదని ఆవేదనతో చెప్పారన్నారు. సహాయక చర్యలు అధ్వానంగా ఉన్నాయనడానికి తానే ప్రత్యక్ష సాక్షినని, తన బంగళాకే విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించలేదని ధర్మాన అన్నారు. తుపాను విధ్వంసం జరిగి 20 రోజులు దాటుతున్నా విశాఖలోని ప్రతిష్టాత్మకమైన కేజీహెచ్, ఆంధ్రా యూనివర్శిటీలలో విద్యుత్ పునరుద్ధరణ జరగలేదన్నారు.

ఆ సరుకులను టీడీపీ వాళ్లే తీసుకెళ్లిపోయారు...

తుపాను బాధితులకు ఇవ్వడానికి వచ్చిన నిత్యావసర సరుకులు దుర్వినియోగం అయ్యాయని ధర్మాన అన్నారు. గతంలో పనికి-ఆహార పథకంలో టీడీపీ నేతలు బియ్యం కాజేసిన చందంగా గ్రామాలకు వచ్చిన బియ్యాన్ని డీలర్ల నుంచి టీడీపీ కార్యకర్తలు తమ ఇళ్లకు అక్రమంగా తీసుకెళ్లిపోయి ఇష్టానుసారంగా వ్యవహరించరని అన్నారు. టీడీపీ కార్యకర్తలు చెప్పినట్లు వినాలని సాక్షాత్తూ సీఎం కలెక్టర్ల సమావేశంలో చెప్పాక ఇక పరిస్థితి ఇలాకాక ఎలా ఉంటుందని ఆయన అన్నారు. సీఎం సమర్ధపాలన పేరుతో ఒక బలహీనమైన పరిపాలన అందిస్తున్నారని ఆయన విమర్శించారు.

అవతరణపై బాబు నిర్ణయం సరికాదు...

1956 సంవత్సరం నుంచీ జరుపుకొంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం 13 జిల్లాల ప్రజల మనోభావాలను గాయపరిచిందని, ఇదెంతమాత్రం సరైనదికాదని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసి కొత్త రాష్టం ఏర్పాటు చేశారే తప్ప రాష్ట్రం ఈనాడు ఏర్పడింది కాదని, కేంద్ర ప్రభుత్వ గెజిట్ లో కూడా ఇదే ఉందని ఆయన గెజిట్ ప్రతిని చూపించారు. ఆంధ్రప్రదేశ్ అనేది జూన్ 2న ఏర్పడలేదని, ఎందరో మహనీయుల త్యాగాలు, అమరుల ఆత్మబలిదానాలతో ఈ రాష్ట్రం ఏర్పడింది నవంబర్ 1నే అని ఆయన అన్నారు.

త్వరలో ప్రధానిని కలవనున్న శ్రీ వైఎస్ జగన్...

తుపాను బాధిత ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని వివరించి కేంద్రం నుంచి సాయం కోరడానికి త్వరలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తామని ధర్మాన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రధాని దృష్టికి తెచ్చి ఆయనను ఒప్పించి సాయం పొందేందుకు కృషి చేస్తామన్నారు.

తాజా వీడియోలు

Back to Top