టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక‌

 ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍
 
వైయ‌స్ఆర్ జిల్లా': వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను జమ్మలమడుగు మండలం గొరిగెనూర్‌లో అడుగుపెట్టకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో  వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు శుక్రవారం గొరిగెనూరులో అడుగుపెట్టారు. గ్రామానికి చెందిన పలువురు నేతలు నేడు వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి సమక్షంలో ఓబులేసు, భాస్కర్‌రెడ్డి, నీలకంఠ అనుచర వర్గం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ జమ్మలమడుగు ఇన్‌చార్జ్‌ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓబులేసుతో సహా పలువురు నేతలు తమ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. తమను ఇక్కడికి రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో ప్రజలు అంత చూశారని అన్నారు. వైయ‌స్ఆర్‌  కుటుంబాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానికంగా ఏం జరిగిన మంత్రి ఆదినారాయణ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ  జెండా ఎగరాలని అన్నారు.

గత కొద్ది రోజులుగా వైయ‌స్ఆర్ జిల్లా నేతలు గొరిగెనూరుకు వెళ్లకుండా పోలీసులు నియంత్రించిన సంగతి తెలిసిందే. దీనిపై వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ  నేతల రిట్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఒక గ్రామానికి వెళ్లకుండా వ్యక్తుల అంక్షలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.


Back to Top