రాక్షస పాలనకు చరమగీతం పాడండి

కడకెల్ల (శ్రీకాకుళం జిల్లా) :

రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతున్న రాక్షస, రాబందుల పాలనకు చరమగీతం పాడాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. జనం సమస్యలు పట్టని ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి,‌ దానితో నిస్సిగ్గుగా అంటకాగుతున్న తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళూ మన రాష్ట్రం ఒక సువర్ణయుగంలా ఉందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా కన్నతండ్రిలా పాలించారన్నారు. మళ్లీ ఆ సువర్ణయుగం కావాలంటే ప్రజల ఓటే నాంది కావాలి అన్నారు. రాజన్న రాజ్యంలో వైయస్ రాజశేఖరరెడ్డి‌ కన్న కలలన్నింటినీ జగనన్న సాకారం చేస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం తీరుకు, దానితో కుమ్మక్కైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారంనాటి పాదయాత్ర ఆసాంతం జోరువానలోనే కొనసాగింది. వానలో తడుస్తూనే శ్రీమతి షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తడిసిముద్దయినా లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు దారిపొడవునా శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. వీరఘట్టం మండలం కడకెల్లలో జరిగిన సభలో శ్రీమతి షర్మిల వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు.

మన ముంగిట మళ్ళీ రాజన్న రాజ్యం:

మహానేత, దివంగత ముఖ్యమంత్రి‌ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో ఎ‌న్నెన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞం.. రైతులను ఆదుకునేందుకు 7 గంటల ఉచిత విద్యుత్తు.. రైతులు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు.. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్.. ఆరోగ్యశ్రీ.. ఫోన్ చేయగానే కు‌య్‌కుయ్ అంటూ వచ్చే 108, 104.. ఇలా ఎన్నో పథకాలను ఆ‌యన అద్భుతంగా అమలు చేశారన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకూడదని ఎలాంటి చార్జీలు పెంచలేదు. పన్నులు వేయలేదని గుర్తుచేశారు.

కానీ వైయస్ వెళ్లిపోయిన తర్వాత ఆయన పథకాలను తుంగలో తొక్కా‌రని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. అడ్డగోలుగా అన్నింటిపై చార్జీలు పెంచేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు రాక్షస రాజ్యం.. రాబందుల రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. ఈ ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానితో కుమ్మక్కైన ‌టిడిపికి సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధి చెప్పండని ఆమె పిలుపునిచ్చారు.

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం వస్తుం‌దన్నారు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతారని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలన్న రాజన్న కలను నిజం చేస్తారన్నారు. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు ఉండాలన్న రాజన్న ఆశయాన్ని నెరవేరుస్తారన్నారు. జగనన్న సిఎం అయ్యాక మహిళలు, రైతులకు వడ్డీ లేకుండానే రుణాలు అందుతాయన్నారు. రైతు పంటను నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.700 పింఛన్ అందుతుం శ్రీమతి షర్మిల చెప్పారు. వికలాంగులకు రూ.1,000 పింఛన్ అవుతుందన్నారు. వైయస్ఆర్ అమ్మ ఒడి పథకం ద్వారా కుటుంబంలో ఇద్దరు పిల్లలకు పదో తరగతి వరకు ప్రతినెలా రూ.500 నేరుగా అమ్మ ఖాతాలోనే పడతా‌యన్నారు. ఇంటర్మీడియెట్‌కు రూ.700, డిగ్రీ చదువులకైతే రూ.1,000 అమ్మ ఖాతాలోనే జమవుతాయన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు, రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి ఓటు వేసినప్పుడు, జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు, వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అభ్యర్థులను గెలిపించినప్పుడు ‌రాజన్న కాలం నాటి సువర్ణ యుగం మళ్లీ వస్తుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్‌కు ప్రజలు వేసే ప్రతీ ఓటు జగనన్న నిర్దోషి అని మీరు నమ్ముతున్నారని చాటి చెబుతుందని శ్రీమతి షర్మిల అన్నారు.

13.8 కిలోమీటర్ల పాదయాత్ర..:
ఆదివారం 216వ రోజు పాదయాత్ర విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా విక్రమపురం సమీపంలో ముగిసింది. ఆదివారం 13.8 కి.మీ. నడిచారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం సంతోషపురంలో ప్రారంభమై ఖడ్గవలస, నాగూరు, చిలకాం క్రాస్‌ రోడ్డు, కార్యవలస, రావివలస మీదుగా శ్రీకాకుళం జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది. అనంతరం కడకెల్ల, నడిమికెల్ల, విక్రమపురం మీదుగా చిట్టపుడివలస వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి శ్రీమతి షర్మిల చేరుకున్నారు.

రాజన్న పథకాలు అందడం లేదమ్మా..:
శ్రీకాకుళం జిల్లా కడకెల్లలో మహిళలు శ్రీమతి షర్మిలతో తమ కష్టాలను చెప్పుకున్నారు. వితంతు పింఛన్లు మంజూరు చేయడం లేదని గోడు వెళ్ళబోసుకున్నారు. ‘వైయస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదమ్మా..’ అంటూ వారు ‌ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్యపడవద్దని, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని వారికి శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. కడకెల్ల, నడిమికెల్ల, విక్రమపురం గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నామని మహిళలు చెప్పడంతో శ్రీమతి షర్మిల ఆనందం వ్యక్తం చేశారు. ‘మీ స్ఫూర్తి రాష్ర్ట మహిళా లోకానికి ఆదర్శం..’ అని వారిని అభినందించారు.

Back to Top