'గోదావరి జిల్లాల రైతులు వద్దంటున్న పట్టిసీమ కడుతున్నారు'

హైదరాబాద్: ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెత్తికెత్తుకున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ఆరోపించారు. చివరకు అదే ఆయన  మెడకు శనిలాగా చుట్టుకుంటుందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమకు వేసే పునాదిరాయి పోలవరం ప్రాజెక్టుకు సమాధి అవుతుందన్నారు. ప్రాజెక్టుల బాట సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టిసీమలో పర్యటించినపుడు గోదావరి జిల్లాల రైతులే ముందుకొచ్చి ఈ ప్రాజెక్టు వల్ల వారికి జరిగే అన్యాయాన్ని వివరించారన్నారు.
 
ఈ ప్రాజెక్టు ఎంత నిరర్థకమో రైతులే స్వయంగా చెబుతుంటే... ఆ వాస్తవాలను జీర్ణించుకోలేక టీడీపీకి చెందిన  ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, లోకేశ్ వంటి వారంతా జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జగన్  సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా... ఆయన లక్ష కోట్లు తిన్నారంటూ టీడీపీ నేతలు ఎంత కాలం నిందలేస్తూ పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top