దేవుడు న్యాయం చేశాడు: షర్మిల

హైదరాబాద్ :

‘దేవుడు మాకు న్యాయం చేశాడు...జగనన్నకు బెయిల్ వచ్చింది..’ అని‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల హర్షం వ్యక్తంచేశారు. ‘ఒక్క జగన్‌కు మాత్రమే బెయిల్ రావడం కాదిది... కోట్లాది‌ మంది రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే అంశం.. వారంతా ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు..’ అంటూ ఆమె స్పందించారు. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారంనాడు శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ ఇచ్చిన వార్త విన్న అనంతరం శ్రీమతి షర్మిల మీడియాతో పంచుకున్న భావాలివి. లోటస్‌పాండ్‌లోని శ్రీ జగన్మోహన్‌రెడ్డి నివాసంలో తమ కుటుంబ సభ్యులకు అభినందనలు చెప్పేందుకు వచ్చిన బంధువులు, శ్రేయోభిలాషులను చిరునవ్వుతో పలుకరిస్తూ.. శ్రీమతి షర్మిల ఉల్లాసంగా గడిపారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే‌ శ్రీ జగన్‌ను కాంగ్రెస్‌ పార్టీ అణగదొక్కాలని చూసిందని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తం చేశారు. శ్రీ జగన్‌తో ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ పార్టీ భావించిందని, పెద్ద సవాలుగా తయారవుతారనే ఉద్దేశంతో సిబిఐ ద్వారా కేసులు పెట్టి వేధించిందని అన్నారు.‌ కాంగ్రెస్ పార్టీకి‌ మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి 30 ఏళ్లు చేసిన సేవలను మర్చిపోయి ఆయన కుటుంబాన్ని వేధించడానికి కాంగ్రెస్ పూనుకు‌న్నదని ఆరోపించారు.

‘వైఎస్ఆర్ ‌లాంటి బలమైన నాయకుని మరణం తరువాత ఇంత పెద్ద రాష్ట్రం శ్రీ జగన్మోహన్‌రెడ్డి చేతుల్లోకి వెళ్లిపోవడం ఆ పార్టీకి ఇష్టం లేదు. ఎలాగైనా తమ పట్టు కొనసాగాలనే ఉద్దేశంతో ఇలాంటి దుష్ట చర్యలకు పాల్పడింది..’ అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. కానీ దేవుని వల్లనే ఈ రోజు ఈ అద్భుతం జరిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదలతో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ పునరుజ్జీవం పొందిందనీ, వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అత్యధిక స్థానాలు గెల్చుకుంటుందని శ్రీమతి షర్మిల ధీమాగా చెప్పారు. కేంద్రంలో కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్ నిర్ణయాత్మక పాత్ర నిర్వర్తిస్తుందన్నారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ..‌ ఏ ప్రాంతంలో అయినా రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌కు అపారమైన ప్రజాభిమానం ఉందని ఆమె తెలిపారు. అలా కోట్లాది మంది ప్రజల హృదయాల్లోకి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వెళ్లిందని‌ శ్రీమతి షర్మిల చెప్పారు.

Back to Top