సీఎం తమ్ముడిని అరెస్టు చేయాలి

హైదరాబాద్ 13 జూలై 2013:

చిత్తూరు జిల్లా కలికిరిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనను పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నందునే తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉన్న ఓట్లను తీసివేయడం, కొత్తవి చేర్చడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని చెప్పారు. సీఎం తమ్ముడి నేతృత్వంలో ఈ దాడులు చేస్తున్నారనీ, ఆయనను పీడీ చట్టం కింద అరెస్టుచేయాలని గట్టు డిమాండ్ చేశారు. ఈ సంఘటనలతో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్లేనన్నారు. ఓటమి భయంతోనే ఆ పార్టీ నియంతృత్వ పోకడలు పోతోందని ఆయన ధ్వజమెత్తారు. వైయస్ఆర్ మరణానంతరం ఏర్పాటైన తమ పార్టీ నిర్వహించిన అన్ని ఉప ఎన్నికలలో అద్వితీయమైన విజయాలు సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సహకార ఎన్నికలలో రాత్రికి రాత్రికి 14లక్షల ఓట్లను చేర్పించుకుని గెలిచినట్లు కాంగ్రెస్ నాటకాలాడిందన్నారు. ఇదే పద్ధతిని పంచాయతీ ఎన్నికలలో అవలంబించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూనుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. నామినేషన్లు వేయడానికి వెళ్ళిన మహిళను అడ్డుకుని, వారిపై దాడిచేసి నియంతృత్వంగా వ్యవహరించారన్నారు. దీనిని చిత్రించబోయిన సాక్షి మీడియాపై కూడా దాడికి దిగి, కెమెరా పగులకొట్టారన్నారు. నామినేషన్ వేసేందుకు వరుసలో నిలబడిన వారిని కూడా గుంజివేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలలో గెలవడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందన్నారు. దీనిని ఎన్నికల కమిషన్ ఛేదించాలని కోరారు. లేకపోతే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగవని దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. కిషోర్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసి ఎన్నికలయ్యేంత వరకూ విడుదల చేయకూడదని గట్టు కోరారు.

తాజా వీడియోలు

Back to Top