గుంతకల్లు రైల్వేజోన్‌ సాధనకు ఉద్యమం

గుంతకల్లు : రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీ కొత్త రైల్వేజోన్‌ను గుంతకల్లు కేంద్రంగా ఏర్పాటు చేసే దాకా కలిసిగట్టుగా పోరాడుదామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సర్కిల్‌లో పీపుల్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో గుంతకల్లు రైల్వేజోన్‌ విషయం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట్లాడుతూ అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్న చందంగా గుంతకల్లులో రైల్వేజోన్‌ ఏర్పాటుకై అన్నీ అర్హతలున్నా పాలకుల చేతకానితనం వల్లనే ఈ డిమాండ్‌ మరుగున పడుతోందన్నారు. పరిశ్రమల్లేక, ఉపాధి దొరక్క గుంతకల్లు, చుట్టూపక్కల గ్రామాల ప్రజలు ప్రతిరోజూ వందల సంఖ్యలో బళ్లారి, తోర్నగల్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లి తమ కుటుంబాలను పోషించుకోవాల్సిన దౌర్భగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గుంతకల్లు రైల్వే జోన్‌ సాధన కోసం రానున్న రోజుల్లో ఉద్యమాలను తీవ్రతరం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జలికట్టు నిర్వహణకై కేంద్రంతో పోరాడి సాధించిన తమిళనాడు సీఎంను ఆదర్శంగా తీసుకుని మన పాలకులు కూడా కేంద్రంతో ఢీకొని తాడోపేడో తేల్చుకోవాలని సూచించారు.

Back to Top