ఉత్తరాంధ్ర నుంచి సినీ ప్రముఖుల పార్టీ ప్రచారం

హైదరాబాద్:

కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ విజయం సాధించటం కోసం విశేషంగా ప్రచారం చేయాలని పలువురు సినీ రంగ ప్రముఖులు నిర్ణయించారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, నిర్మాత జి.ఆదిశేషగిరిరావు, దర్శకుడు ఆదిత్య, సినీ నటుడు గిరిబాబు, హీరో రాజా, సీనియర్ క్యారెక్టర్ నటుడు హేమసుంద‌ర్‌తో సహా పలువురు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తమ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి మాట్లాడుతూ... ఒక సీఎం ఎలా ఉండాలో మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి చూపించారని  కొనియాడారు. వైయస్ఆర్‌ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆ అభిమానంతోనే శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కొత్త రాష్ట్రానికి శ్రీ జగన్ నాయకత్వం ‌ఎంతో అవసరం అన్నారు.

జాబు కావాలంటే బాబు రావాలంటూ చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని గిరిబాబు ఎద్దేవా చేశారు. 'జబ్బు రావాలంటే బాబు రావాలి.. జబ్బులు పోవాలంటే జగన్ రావాలి‌' అన్నారు. వైయసార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే‌ శ్రీ జగన్ సీఎం కావాలని తాము నమ్ముతున్నామని తెలిపారు.

‌వైయస్‌ జగన్‌ను టార్గెట్ చే‌స్తున్న మీడియా:
మీడియా మొత్తం శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శ లు చేస్తోందని హీరో రాజా ఆక్షేపించారు. మీడియా శ్రీ జగన్‌పై ఎంత బురద జల్లినా ఆయన విజయాన్ని ఆపలేరన్నారు. అన్ని పార్టీలూ కలిసి శ్రీ వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నాయంటే ఆయన ఎంత బలవంతుడనేది అర్థమవుతోందని హేమసుందర్ అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడుతోంది కనుక కొత్త రక్తం చాలా అవసరమని, పాత వారికి వీడ్కోలు పలకాల్సిందేనని చెప్పారు.

‌ఒకటీ రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి తమ పర్యటన ప్రారంభమవుతుందని దర్శకుడు ఆదిత్య తెలిపారు. సినీనటులు విజయచందర్, పృథ్వి పార్టీ తరపున ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.

Back to Top