పోరాటం ఇంతటితో ఆగదు

బాబు మోనార్క్ లాగా వ్యవహరిస్తున్నాడు
అమర్నాథ్ దీక్షపై ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా
మహనీయుల చిత్రపటాలను తొక్కుతారా
తక్షణమే రైల్వే జోన్ ప్రకటన చేయాలిః బొత్స

విశాఖపట్నంః అమ్మ పెట్టదు...అడుక్కొని తిననివ్వదు అన్న చందంగా చంద్రబాబు సర్కార్  పనితీరు ఉందని వైఎస్సార్సీపీ సీనియరన్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఆయన అఖిలపక్షాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖకు  రైల్వే జోన్ కేటాయించాలని గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షపై....చంద్రబాబు సర్కార్ క్రిమినల్ మైండ్  తో వ్యవహరించిందని దుయ్యబట్టారు. అమర్ నాథ్ దీక్షను రాత్రికి రాత్రి భగ్నంచేయడాన్ని అన్ని పార్టీలు, మేధావులు, వివిధ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు అఫ్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. 

రైల్వే జోన్ కోసం పోరాడుతున్న అమర్నాథ్, మద్దతు ప్రకటించిన అఖిలపక్షాలు మీకు  సంఘ విద్రోహశక్తుల్లా కనిపిస్తున్నారా...? లేక టెర్రరిస్టులమా...? తమపై ఎందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   రైల్వే జోన్ తీసుకురావాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని బొత్స తెలియజేశారు. రైల్వే జోన్  తీసుకొచ్చే అంశంపై  కేంద్రాన్ని నిలదీయాల్సిందిపోయి...అందుకోసం ఉద్యమిస్తున్న వారిపట్ల స్వార్థపూరితంగా వ్యవహరించడం హేయనీయమన్నారు. ప్రతి దానికి ఓ ప్రక్రియ, ఆచరణ, అలవాట్లు ఉంటాయని...వాటన్నంటినీ తొక్కేస్తూ చంద్రబాబు మోనార్క్ లాగా ఏక చత్రాధిపతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పెద్దలు బాబు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం దుర్మార్గమన్నారు.  

రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, అఖిలపక్షాలన్ని ఏకమై రైల్వే జోన్ కావాలని కోరుకుంటుంటే.. టీడీపీ మాత్రం రాత్రికి రాత్రి అమానుషంగా దీక్షా శిబిరం నుంచి అమర్నాథ్ ను తీసుకెళ్లి ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం దారుణమన్నారు. మాట్లాడితే నీతివంతుడిని, దూరదృష్టితో ఆలోచనలు చేస్తానని చెప్పుకునే బాబు...మీడియాను ఆస్పత్రిలోనికి ఎందుకు అనుమతించ లేదని ప్రశ్నించారు. మీడియాను అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారని నిలదీశారు. 


రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వారిని టార్గెట్ చేసి, బూతద్దంలో చూపించి... వారిని దుర్మార్గులుగా చిత్రీకరిచేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని బొత్స ఫైరయ్యారు.టీడీపీ ఒంటెద్దు పోకడలను ప్రజలు గమనించాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు వేయించుకున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇంగితజ్ఞానం లేదా అని బొత్స నిప్పులు చెరిగారు. విశాఖకు రైల్వే జోన్ తీసుకొస్తామని  ప్రభుత్వం ప్రకటన చేయాలని బొత్స డిమాండ్ చేశారు. 

మహనీయులు జాతిపిత మహాత్మ గాంధీ, రాజ్యంగ నిర్మాత అబేద్కర్ చిత్రపటాలను  కాళ్లతో తొక్కూతూ పోలీసులు అమర్నాథ్ ను లాక్కెళ్లడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ పోరాటం ఇంతటితో ఆగదని చెప్పారు. అఖిలపక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉద్యమంపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అవసరమైతే పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతామని బొత్స తేల్చిచెప్పారు. 

Back to Top