ప‌ర్య‌ట‌న‌లు స‌రే... హామీల మాటేంటి..? -త‌మ్మినేని

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ హైప‌వ‌ర్ క‌మిటీ స‌భ్యుడు త‌మ్మినేని సీతారాం
శ్రీకాకుళం అర్బన్:  జిల్లాలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నోసార్లు ప‌ర్య‌టించి వాగ్దానాలు చేయ‌డ‌మే త‌ప్ప అందులో ఒక్క‌టి కూడా అమ‌లైన దాఖలాలు లేవ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ హైప‌వ‌ర్ క‌మిటీ స‌భ్యుడు, మాజీమంత్రి త‌మ్మినేని సీతారాం అన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం బాబు చేతిలో కీలుబొమ్మ‌గా మారార‌ని ఆరోపించారు. కేంద్ర సంస్థ‌ల‌ను శ్రీ‌కాకుళంలో నెల‌కొల్పాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ఒత్తిడి తేవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. పోలాకి థర్మల్ ప్లాంట్‌ను ప్రజలు వ్యతిరేకిస్తుంటే పోలీసులతో లాఠీఛార్జి చేయించడం ద్వారానే బాబు ప‌నితీరు తెలుస్తోంద‌న్నారు. సోంపేట, కాకరాపల్లి కాల్పుల అనంతరం, అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్ష నేత హోదాలో జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఈ ప్లాంట్లను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
 
కళింగపట్నంలో విమానాశ్రయం, బావనపాడులో షిప్పింగ్‌హార్బర్, ట్రైబల్ యూనివర్సిటీ, ఏర్పాటు చేస్తామ‌న్న బాబు హామీల సంగ‌తేంట‌ని సీతారాం ప్ర‌శ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో 11 కేంద్ర సంస్థలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చిందని తెలిపారు. ఇప్పటికే 9 సంస్థలు ప్రారంభమయ్యాయన్నారు. మరో రెండు సంస్థలు ప్రారంభించాల్సి ఉందన్నారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు వీటిలో ఒక్క కేంద్ర సంస్థనైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు.  అధికారం చేపట్టిన తర్వాత మాట మార్చి థర్మల్, అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధపడడం దారుణమన్నారు.

Back to Top