ఎన్నికల వేడి రగిలించిన కోర్టు తీర్పు

హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికలకు మళ్ళీ ఊపొచ్చింది. ఓ పక్క బీసీ రిజర్వేషను అంశం తేలకుండానే ఎన్నికలకు వెడితే ఏ పరిస్థితి ఎదురవుతుందోనని అధికార పక్షం మల్లగుల్లాలు పడుతోంది. ఇటీవలి ఉప ఎన్నికల్లో దెబ్బ తిన్న పార్టీలకు మళ్ళీ ఎన్నికలంటే వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది. మరో ఎన్డీటీవీ ఎన్నికల సర్వే కంటిమీద కునుకు రానీయడం లేదు. ఇప్పటికే జనాదరణలో ముందున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది సేపట్లోనే పులివెందులలో ప్రకటించారు.

ఇప్పటికే ఆలస్యం: బొత్స

ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఆలస్యమైందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంగీకరించారు. ఈ విషమంలో రాజ్యాంగపరమైన అంశాలనూ, కోర్టు తీర్పనూ, వాస్తవ పరిస్థితులనూ ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విధానాన్ని ప్రభుత్వం రూపొందించుకుంటుందని తెలిపారు. కోర్టు తీర్పుతో పంచాయతీ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కొంత మేరకు తగ్గవచ్చని...అయితే మున్సిపాలిటీల్లో బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది ఉండదని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ తెలిపారు. హైకోర్టు తీర్పు పూర్తి పాఠాన్ని పరిశీలించి ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తుందని ఆయన మంగళవారమిక్కడ చెప్పారు. ఎన్నికలు పార్టీ గుర్తుతో నిర్వహించాలా... లేదా అనేది చర్చించాల్సి ఉందన్నారు.

2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు: కృష్ణయ్య

ఇదిలా ఉండగా కోర్టు తీర్పులో మాదిరిగా 2001 కాక, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను నిర్ణయించి, ఆమేరకు స్థానిక ఎన్నికలలో సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ప్రకారం చేయకుంటే అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు.

Back to Top