దుబాయ్ ఖైదీల కుటుంబాలకు విజయమ్మ భరోసా

హైదరాబాద్‌ : దుబాయ్‌లో జైళ్ళలో గత ఎనిమిదేళ్ళుగా మగ్గిపోతున్న మన రాష్ట్రానికి చెందిన ఖైదీలను విడిపించేందుకు ప్రయత్నం చేస్తానని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కరీంనగ‌ర్ జిల్లా పెద్దూరు, చందుర్తి, కోనరావుపేట, నిజామాబా‌ద్ జిల్లా మానాలకు చెందిన ఆరుగురు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్ళారు. అయితే, ఊహించని పరిస్థితుల్లో ‌2005లో వారంతా ఒక హత్య కేసులో ఇరుక్కుని దుబాయ్ జైలు‌ పాలయ్యారు. దుబాయ్ జై‌లులో మగ్గిపోతున్న తమ వారిని విడుదల చేయించాలంటూ వారి కుటుంబ సభ్యులు పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఖైదీల భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు మంగళవారంనాడు శ్రీమతి విజయమ్మను ఆమె నివాసంలో కలిశారు.

దుబాయ్‌ జైలులో ఇబ్బందులు పడుతున్న తమ వారి కోసం విలపిస్తున్న ఆ మహిళలను విజయమ్మ దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. బాధపడవద్దని, జైల్లో ఉన్నవారిని విడిపించేందుకు కృషి చేస్తామని, అందుకయ్యే డబ్బును కూడా పార్టీ తరఫున భరిస్తామని భరోసా ఇచ్చారు. శిక్ష అనుభవిస్తున్న వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంక‌ట్‌ను శ్రీమతి విజయమ్మ ఆదేశించారు.

అనంతరం బాధిత మహిళలు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీమతి విజయమ్మ ఇచ్చిన భరోసాతో తమకు కొండంత ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ఆమె హామీతో తమ వాళ్లు విడుదల అవుతారనే ఆశ కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యు‌లు కె.కె.మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ కూడా పాల్గొన్నారు.
Back to Top