ఏకగ్రీవాలపై దుష్ప్రచారం : మైసూరా

హైదరాబాద్, 18 జూలై 2013:

ఏకగ్రీవమైన పంచాయతీ సర్పంచ్‌ పదవుల్లో అత్యధికంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సాధించిందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి తెలిపారు. స్థానిక సంస్థలకు సంబంధించి మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసిందని ఆయన చెప్పారు. వైయస్ఆర్‌ పార్టీ శ్రేణుల నుంచి సేకరించిన సమాచారం మేరకు అత్యధిక స్థానాలు సాధించి మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. పార్టీ మద్దతుతో పోటీ చేసినవారు, స్వతంత్రులుగా బరిలో దిగిన వారికి మద్దతు ఇవ్వడం ద్వారా మొత్తం ఏకగ్రీవమైన స్థానాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీల కన్నా కూడా అగ్రస్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. ఏకగ్రీవంగా తమ మద్దతుదారులను ఎన్నుకున్నందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మైసూరారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పంచాయతీ ఎన్నికలను పార్టీ రహితంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎన్నికైన అభ్యర్థులు ఏ పార్టీకి చెందినవారో పరిశీలన చేసుకుని ఎన్నికల కమిషన్ ప్రకటిస్తే బాగుంటుందన్నారు. తమ పార్టీ తరఫున 855 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామన్నారు. ఎన్నికైనవారు ఏ పార్టీకి చెందినవారో విచారించి ప్రకటించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తే తాము కూడా సిద్దంగా ఉన్నామన్నారు. తమ పార్టీ మీద దుష్ప్రచారం చేయడంలో భాగంగా ఎవరికి తోచిన సంఖ్యలను వారు తమ ఇష్టం వచ్చినట్లు ప్రకటిస్తున్నారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరు ఏ విధంగా ప్రచారం చేసుకున్నా ప్రజల అభిమానం మాత్రం తమపైనే ఉందన్నారు.

పార్టీ గుర్తులు లేకుండా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలే కాకుండా రెండవ దశలో జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయ పరంపర కొనసాగిస్తుందని మైసూరారెడ్డి ధీమాగా చెప్పారు. పార్టీ గుర్తుల మీద త్వరలో నిర్వహించే ఎంపిటిసి, జెడ్పీటీసీ, మున్నిపల్‌ ఎన్నికల్లో కూడా ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. పార్టీ గుర్తులతో జరిపించాల్సిన ఆ ఎన్నికలను ప్రభుత్వం దురుద్దేశంతోనే వెనక్కి జరిపిందని ఆయన విమర్శించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చిన కొందరు ఎమ్మెల్యేలను సాగదీసి సాగదీసి అనర్హులుగా ప్రకటించారని మైసూరా ఎద్దేవా చేశారు. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తే తనకు ఓటమి తథ్యమనే భయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి కుతంత్రాలకు పాల్పడిందని విమర్శించారు. ఏదేమైనా ప్రజాభిమానం తమ వైపే ఉందనడానికి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు అత్యధిక చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికవడమే ఉదాహరణ అన్నారు.

తాజా వీడియోలు

Back to Top