- సుజనా గవర్నర్‌ను కలవడంలో అంతర్యమేంటి?
- సాంకేతిక కారణాలతో ఓటుకు కోట్ల కేసు నీరుగార్చేందుకు సన్నాహాలు
- కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ధితో కేసు పునర్ విచారణ చేపట్టాలి
- వ్యవసాయం, రైతులంటే బాబుకు చులకన
- సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకునే సిద్ధాంతం బాబుది
- వైయస్‌ఆర్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్: రాజ్యాంగ విలువలను పరిరక్షించే రాజ్‌భవన్‌ను రాజీభవనం, లాలూచీ భవనంగా చేయొద్దని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. నిన్నటి రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన టీడీపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చి గవర్నర్‌ను కలవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసును నీరు గార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స దుయ్యబట్టారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్రంతో భేటీ అయిన సుజనా చౌదరి గవర్నర్‌ను కలిసి ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై చర్చించామని చెబుతున్నారన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ ఎవరి చెవ్వుల్లో పూలు పెట్టాలనుకుంటున్నారని బొత్స సుజనా చౌదరిని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు రాజ్‌భవన్‌ను రాజీ భవన్‌గా చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. సాక్షాత్తు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో హోదా ఇవ్వబోమని ప్రకటించిన తరువాత మళ్లీ అదే అంశాన్ని గవర్నర్‌తో చర్చించామని చెప్పడం శోచనీయమన్నారు. ఒకవేళ హోదాపై చర్చించాల్సివుంటే ప్రధాని, సంబంధిత అధికారులతో సమావేశం కావాలని కానీ, గవర్నర్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏమైనా రాజ్యంగపరమైన అంశమా చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు కోట్లు కేసులో భారతీయ జనతా పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తూ కేసును నీరుగార్చి చట్టాన్ని చేతులోకి తీసుకొని బాబు వ్యక్తిగత స్వార్థం కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టామని టీడీపీ నేతలు నిజాన్ని ఒప్పుకోవాలన్నారు. ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకోవడం కోసం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టుపెట్టారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాల్లో చెప్పిందని గుర్తు చేశారు. ప్రతిపక్షంగా వాళ్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఇది వాస్తవమా కాదా ? అని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కేంద్ర రాజ్‌భవన్‌లో రాజీలు కుదర్చడం సమంజసమేనా అని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో అన్ని ఆధారాలున్నాయి చంద్రబాబును జేజమ్మ కూడా రక్షించలేదని ఆ సంఘటన జరిగి 14 నెలలు గడుస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఛార్జ్‌షీట్‌లో 21 సార్లు చంద్రబాబు పేరు ఉటకించిన తరువాత కూడా ఎందుకు ఆయనపై విచారణ చేపట్టలేదని, ఆయన స్వరనమూనాను ఎందుకు పరీక్షించలేదని తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంటే సామాన్య ప్రజానికానికి ఒక న్యాయం, ముఖ్యమంత్రులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పెద్దస్థాయి వారు పెద్ద తప్పు చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినా పర్వాలేదా ఇదెక్కడి ధ్వంద న్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో జరుగుతున్న వ్యవహారం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా విభజన అంశాలలో ఒక్కదానిపై చంద్రబాబు ప్రభుత్వం రాజీపడినా ప్రధాన ప్రతిపక్షంగా వైయస్‌ఆర్ సీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబును హెచ్చరించారు. ప్రపంచమంతా చూస్తుండగా రూ. 50 లక్షలు ఇస్తూ దొరికిపోయినా, లోకేష్ డ్రైవర్ ఆ డబ్బు తీసుకువచ్చాడని పత్రికలన్నీ గోషించినా ఎందుకు విచారణ చేపట్టలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి భయటపడటానికి చంద్రబాబు కేసులోని సాంకేతిక లోపాలను వెతుకుతున్నారని, అన్ని రోజులు మనవేకావు అని టీడీపీ సర్కార్‌ను ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఓటుకు కోట్లు కేసులో విచారణ జరిపించాలని, లాలూచీలతో చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని డిమాండ్ చేశారు.
తెలియదనడం సిగ్గుచేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు కరువు, వర్షపాతం వచ్చే అంశాలు నాకు, టీడీపీ ఎమ్మెల్యేలకు, అధికారులకు తెలియదని మాట్లాడడం సిగ్గుచేటని బొత్స విమర్శించారు. అంటే ఏపీలో టీడీపీ పరిపాలన తీరు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. ఒక పక్క నా చేతిలోని కంప్యూటర్, సెల్‌ఫోన్ ద్వారా ఏ గుంతలో ఎంత నీరుందో రెండు నిమిషాల్లో చెప్పేస్తాననే బాబు కరువు పరిస్థితులపై అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం డ్యాష్ బోర్డులో ఉన్న అంశాలపై ఎందుకు ఇంత బేలతనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు చెప్పే టెక్నాలజీ మాటలన్ని మాయమాటలేనా అని అనుమానం వ్యక్తం చేశారు. డ్యాష్ బోర్డులో ఆగస్టు 1 నుంచి 24 వరకు వర్షపాతం డెఫిషెట్‌గా ఉంటుందని, జిల్లాల వారిగా డిటైల్స్ ఉన్నాయన్నారు. చంద్రబాబుకు వ్యవసాయం, రైతు అంటే చుకన భావన కాబట్టే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యవసాయం శుద్ద దండగ, రైతుకు ప్రధాన శత్రువు చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పరిపాలనలోని డొల్లతనం ఎక్కడ భయటపడుతుందోనని ఈ నెల 12వ తేదిన జరగాల్సిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ మీటింగ్‌ను కూడా శాసనసభ సమావేశాల అనంతరానికి వాయిదా వేశారని చెప్పారు. ఆగస్టు నెలలో రైతుల పంటలకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టకుండా, కరువు, ఎండ, పుష్కరాలు వచ్చినా పండగ చేసుకునే ఉద్దేశ్యంతో ఉందన్నారు. సంక్షోభాన్ని అవకాశంంగా మల్చుకోవాలనే సిద్ధాంతం బాబుదని దుయ్యబట్టారు. వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉంటే రూ. 50 కోట్లు ఇచ్చి హెరిటేజ్ మజ్జిగ పంపిణీ చేయమంటారు. కరువు వస్తే రెయిన్ గన్స్ అంటూ పదం పాడుతున్నారన్నారు. నీటిని రెయిన్ గన్స్ ద్వారా అందజేస్తామని సుమారు రూ. 175 కోట్లు వెచ్చించి కొని వాటిని గోదాంలో నిరుపయోగంగా పెట్టారన్నారు. సుమారు రూ. 1700 కోట్లు వెచ్చించి నిర్వహించిన కృష్ణా పుష్కరాలను ఆధ్యాత్మికతతో చేపట్టకుండా ఉకదంపుడు ఉపన్యాసాలతో భక్తులను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ మంత్రుల కేసేలేదు... ఎవరినైనా ఎంతకైనా కొనొచ్చు, రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నా పర్వాలేదన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.