కదిరి: పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు రూ. 9 కోట్ల నకిలీ డీడీల కుంభకోణంలో ఏ 2 ముద్దాయిగావి. ఈ కేసులో జైలు శిక్షతో రూ.13 లక్షల జరిమానా కూడా పడింది. శిక్షపడిన ఖైదీ నన్ను విమర్శించడమా..’ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌పై కదిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో కందికుంటపై నిప్పులు చెరిగారు. ‘నన్ను మూడు పార్టీలు మారావని విమర్శించే ముందు మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలు మారారో ఈ మాట మీ బాబు నడుగు?..కదిరి మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని నీవు చెబుతున్నావ్..అందాకా ఎందుకు..?. మా పార్టీని వీడి మీ పార్టీలోకి వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా చేత రాజీనామా చేయించు. అప్పుడు మా పార్టీ తరపున నేను నిలబడతాను. మా పార్టీ తరపున నువ్వు నిలబడతావో..లేక చాంద్‌బాషాను నిలబెడతారో తేల్చుకోండి. ఎవరు గెలుస్తారో తేలిపోతుంది’ అని సవాల్ విసిరారు. ‘ఎస్‌బీఐలో కూడా డీడీల స్కాం కేసులో రేపో, మాపో మీరు మళ్లీ జైలుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే మీరు శిక్ష పడిన ఖైదీ. రాబోవు రోజుల్లో మీరు కనీసం వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయడానికి అర్హుడు కాదన్న విషయం గుర్తుంచుకుంటే మంచిది’ అని ఫైర్ అయ్యారు. నిజాయితీ, నిబద్దతతో ప్రజలకు సేవచేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నీ లాగా టికెట్ రాకపోతే మీ పార్టీ బలపరిచిన వ్యక్తిని ఓడించడానికి రెబెల్‌గా పోటీ చేయలేదు. నాలాగా సొంత పార్టీ నేతలపై చెప్పులు విసరలేదు’ అని ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు మీరు తాగే మంచినీళ్లు కూడా మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చినవే..అనే విషయం గుర్తుంచుకోండి’ అని డా.సిద్దారెడ్డి హితవు పలికారు.