రైతులను భయపెట్టి భూములు తీసుకోవద్దు

హైదరాబాద్, నవంబర్16: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన భూసేకరణను టీడీపీ ప్రభుత్వం ప్రహసనంగా మార్చేసిందని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. రైతులకు నచ్చజెప్పి, వారిని సంతృప్తి పరచి ఇష్టపూర్వకంగా భూమిని సేకరించే బదులు వారిని పోలీసులతో నెట్టించడం, మంత్రులు బెదిరించడం దారుణమన్నారు. రాష్ట్రంలోని రాజకీయపక్షాలేవీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే రైతుల నోళ్లుగొట్టే విధానాన్ని ప్రతిఘటిస్తున్నామని తెలిపారు.

ఉమ్మారెడ్డి ఆదివారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని విషయంలో రైతులను భయభ్రాంతులను చేయడం తప్ప ప్రభుత్వం తన నిర్దిష్ట విధానమేమిటో ఇప్పటివరకూ ప్రకటించలేదని విమర్శించారు. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సెప్టెంబర్ 26న రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు అవసరమని, 25 వేల ఎకరాల చొప్పున నాలుగు దశల్లో దానిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు.

కృష్ణా నదికి అటువైపున, ఇటువైపున రాజధాని నిర్మిస్తామని తొలుత చెప్పి.. ఇప్పుడు అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు కేంద్రంగా 30 వేల ఎకరాల్లో నిర్మిస్తామని ప్రకటించారన్నారు. వీజీటీఎం పరిధిలో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్టు కూడా యనమల ప్రకటించారన్నారు. రైతులకు భయాందోళన కలిగించేలా సేకరణ అని, ల్యాండ్ పూలింగ్ అని రోజుకో మాట చెప్పేకంటే అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి తీసుకోవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.

కమిటీ సిఫార్సును తుంగలో తొక్కారు..

వ్యవసాయ భూములు సేకరించరాదని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా సిఫార్సు చేసినా దానిని తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఉమ్మారెడ్డి దుయ్యబట్టారు. "మంత్రులు గ్రామాలకు వెళ్తుంటే అసలు ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. దీనికున్న చట్టబద్ధత ఏమిటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భూసేకరణకు, ల్యాండ్ పూలింగ్ మధ్య తేడాను వివరించాలి" అని డిమాండ్ చేశారు.

"ప్రభుత్వం భూసేకరణ చేయాలనుకుంటే 70 శాతం మంది రైతులు అందుకు సమ్మతించాలని, ప్రైవేటు వ్యక్తులు భూసేకరణ చేయాలంటే 80 శాతం మంది సొంతదారులు అంగీకరించాలని కేంద్రం చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్నే అమలు చేస్తుందా? లేక ల్యాండ్ పూలింగ్ విధానానికి మరో కొత్త చట్టం చేయబోతుందా? స్పష్టం చేయాలి" అని కోరారు.
"ల్యాండ్ పూలింగ్ విధానానికున్న చట్టబద్ధత ఏమిటీ? ఈ రోజు కొంతమంది రైతులతో తమకు ఇష్టమేనని కాగితాలు రాయించుకుంటున్నారు. రేపు వాటికి జవాబుదారీ ఎవరు? అందువల్ల ల్యాండ్ పూలింగ్ కోసం ఒక చట్టం చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

విపక్షాలను విస్మరించారు..

సింగపూర్ చిన్న దేశమైనా వారి తలసరి ఆదాయం 20 రెట్లు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారని, ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది ఆయనే కనుక ఏపీ తలసరి ఆదాయాన్ని ఆ స్థాయికి ఎందుకు పెంచలేకపోయారో జవాబు చెప్పాలని ఉమ్మారెడ్డి అన్నారు. రాజధాని విషయంలో ప్రతిపక్షాల్ని చంద్రబాబు పూర్తిగా విస్మరించారని, ఈ విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించలేదని తప్పుపట్టారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకున్న పాత్రను గుర్తించట్లేదన్నారు. తుళ్లూరు ప్రాంత రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం చెప్పడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ బృందం ఈ నెల 17న తుళ్లూరు పరిసర గ్రామాల్లో పర్యటిస్తుందని ఉమ్మారెడ్డి ఈ సంధర్భంగా  తెలిపారు.

Back to Top