ప్రజలకు క్షమాపణ చెప్పాలి

– ప్రజలు పడుతున్న సకల సమస్యలకు కారణం బాబే
– ‘నోట్ల రద్దు’ ముమ్మాటికీ మీ అనాలోచిత నిర్ణయమే 
– అమలు తీరులో లోపాలుంటే ఏ నిర్ణయమైనా ఇంతే
– వెనిజులా లాంటి దేశాలు ఇప్పటికే వెనక్కి తీసుకున్నాయ్‌
– ప్రత్యామ్నాయాలు చూపకుండా అధికారులపై చిందులా
– మీ క్షణానికో మాట, పూటకో నిర్ణయంతో అయోమయం
– చంద్రబాబుపై పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజం 

హైదరాబాద్ః రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సకల సమస్యలకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి పెద్దరికం కాపాడుకోవాలని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దుకు తానిచ్చిన సలహానే కారణమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు కూడా బాధ్యత వహించాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలంతా మీరు చెప్పిన దాని ప్రకారమే ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని ప్రజలంతా నమ్ముతున్నారని ఆయన తెలిపారు. అనంతరం జరిగిన సంఘటనలు కూడా దానికి బలం చేకూరుస్తున్నాయని బుగ్గన పేర్కొన్నారు. అక్టోబర్‌ 12న పెద్ద నోట్లను రద్దు చేయమని బాబు లేఖ రాయడం, నవంబర్‌ 8న మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడం.. దీనికి రెండు రోజుల ముందు హెరిటేజ్‌ను ఫ్యూచర్‌ గ్రూపునకు అమ్ముకోవడం ఈ వరుస పరిణామాలు చూస్తుంటే అంతా మీ నిర్ణయం ప్రకారమే జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

మంత్రులు లైటేసుకుని తిరగడానికే 
చంద్రబాబు పాలనలో ఒకరిద్దరికి మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవని కేవలం కారుపై లైటేసుకుని వెళ్లడానికి తప్ప మరెందుకూ పనికిరావడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనంతా సీఎం పేషీ నుంచే జరుగుతుందని విమర్శించారు. అధికారులకు తప్ప మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికీ అధికారాలు లేవన్నారు. పయ్యావుల కేశవ్‌లాంటి సీనియర్లకే టీడీపీలో గుర్తింపు లేదని  జేసీ దివాకర్‌ రెడ్డి చెప్పిన  మాటలు అక్షర సత్యమని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. దళితుల సంక్షేమానికి కేంద్రం కేటాయించిన నిధులను దారి మళ్లించి చంద్రన్న దళితబాట అని ప్రచారం చేసుకుంటున్నారని, దీనిపై కాగ్‌ బాబు ప్రభుత్వానికి అక్షింతలు వేసిన సంగతి మరిచిపోతే ఎలా అని ప్రశ్నించారు. 

మీ విజన్‌ ఇప్పుడు చూపించండి బాబు
ఎప్పుడూ తనేదో విజన్‌తో ముందుకెళ్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న బాబు జనం నోట్ల రద్దుతో అల్లాడిపోతుంటే బాబు ఏం చేస్తున్నారని బుగ్గన ప్రశ్నించారు. సీనియర్‌ మోస్ట్‌ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న బాబు... ఈ సంవత్సరం రబీకి 7.5లక్షల హెక్టార్లకు పడిపోయిన సాగుకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గతేడాది ఇలాంటి కరువు పరిస్థితులే ఉన్నా 11.5లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారని గుర్తుచేశారు. నోట్ల రద్దుపై రైతులు పడుతున్న కష్టాలకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మరొకటి అవసరం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకుంటే అప్పుల పేరిట బ్యాంకర్లు జమ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణం చంద్రబాబేనని చెప్పారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తానంటే బాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదని నోట్ల రద్దుతో డిపాజిట్‌ చేసుకున్న ఆ డబ్బును అప్పుల పేరిట జమ చేసుకుంటున్నారని తెలిపారు. పెద్ద ఆర్థిక వేత్తనని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు దేశంలో 60 శాతం జనాభా వ్యవసాయాధారిత రంగాలపైనే జీవిస్తున్న విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌సీపీ ఏనాడు వ్యతిరేకించలేదన్నారు. అయితే ప్రజలకు కష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించామని బుగ్గన అన్నారు. 

మీ పనితీరుపై రిపోర్టు ఇవ్వండి
అధికారులు, ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకునే చంద్రబాబు తన పనితీరుపై కూడా ఆరాతీస్తే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. మీ పేపర్లు మీరే దిద్దుకుని మీకు మీరే మార్కులు ఇచ్చుకుంటే సరిపోదన్నారు. ప్రశ్నించాల్సిన కేంద్రాన్ని అడక్కుండా బ్యాంకర్లు, కలెక్టర్లపై పడిపోతే సమస్యలు పరిష్కారం కావన్నారు. రెవెన్యూ శాఖలో 44శాతం అవినీతి ఉందని రిపోర్టు ఇచ్చిన సీనియర్‌ మంత్రికి అంతా బాగుందని ప్రచారం చేయమనడం సిగ్గుచేటన్నారు. నిజానికి జనాభా లెక్కల ప్రకారం ఏపీకి 24వేల కోట్లు రావాల్సి ఉండగా కేవలం 14వేల కోట్లు రావడంపై నోరు మెదపరేంటని ప్రశ్నించారు. బాబు చెప్పే మాటలకు నిజాలకు పొంతన లేకుండా ఉన్నాయని తెలిపారు. కో ఆపరేటివ్‌ బ్యాంకుల నుంచి రైతులు డబ్బులు పొందే అవకాశం కల్పించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్నన్ని సమస్యలు దేశంలో ఎక్కడా లేవన్నారు. తాను రెండు రోజుల పాటు రాజస్థాన్‌లో పర్యటించి వస్తే ఎక్కడా పెద్ద పెద్ద క్యూలు చూడలేదన్నారు. 

ఏపీ జీడీపీ దేశానికన్నా ఐదు శాతం ఎక్కువగా ఉందని ప్రచారం చేసుకుంటున్నారే..మరి ఆదాయం ఎందుకు పెరగలేదని బాబును ప్రశ్నించారు. సునాయాసంగా అబద్ధాలు చెప్పడంలో బాబుకు ఎవరూ సాటిరారన్నారు. ఆర్థిక పరిస్థితులపై కేంద్రం ఇచ్చే నివేదికలు రావడానికి రెండేళ్లు సమయం పడుతుంది కాబట్టి ఆలోపు అబద్ధాలతో అంతా బ్రహ్మాండంగా ఉందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మంచి జరిగితే అంతా నా క్రెడిట్టే అని ప్రచారం చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ కష్టాలు వచ్చినప్పుడు అధికారులు, మంత్రులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. నోట్ల రద్దు మంచి నిర్ణయమని మీ మంత్రులు, ఎమ్మెల్యేల చేత ఇన్నాళ్లు ఊరూరా ప్రచారం చేయించి ఇప్పుడేమో కష్టాలకు అసలు కారణం నోట్ల రద్దేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. విలేకరుల సమావేశంలో మీరు చెప్పే మాటలు వింటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాకయ్యారని, కెమెరా వారిౖ వైపు తిప్పడంతో తెల్లమొహం వేశారన్నారు. 

పెట్రోలు, కూరగాయలు మీకుంటే చాలా
పెట్రోలు గవర్నమెంట్‌ ఇస్తుంది.. కూరగాయలు ఉన్నాయి అని చెప్పే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలని హితవు పలికారు. మీరు ముఖ్యమంత్రివి కాబట్టి ప్రభుత్వం ఇస్తుంది. ఎంతైనా పెట్టి కొనగలవు. మీలా ప్రజలంతా సీఎంలు అయిపోలేరుగా అని ఎద్దేవా చేశారు. మీ ఆవేశం తొందరపాటు నిర్ణయాలతో ప్రజలంతా ఇబ్బదులు పడుతున్నారని, క్షణానికొక నిర్ణయం, పబ్లిసిటీతో జనాన్ని అయోమయానికి గురిచేయవద్దని సూచించారు. ఇంతక ముందు కూడా పబ్లిసిటీ పిచ్చితో మీరు చేసిన పదివేల కోట్ల నల్ల కుబేరుడి కామెంట్లు అంతా ఉత్తదేనని తేలిందని.. దీనిపై అప్పటికే అసత్య ప్రచారంతో మీరు, మీ మంత్రులు చేసినా యాగీ అంతా ఇంతా కాదన్నారు. గతంలో కూడా తెలంగాణలో రెండు కళ్ల సిద్ధాంతం..బోర్డర్‌ దాటిన తర్వాత సమైక్యాంధ్ర అని ప్రచారం చేసుకోవడం బాబు స్వభావానికి నిదర్శనమన్నారు. ఎన్నికలకు ముందు రైతులను నమ్మించడానికి చంద్రబాబు ఎద్దులతో ఒక ఫొటో, నాగలి పట్టుకుని, గొంగళి కప్పుకుని, తలపాగా ధరించి ఫొటోలు దిగి చేసుకున్న ప్రచారం అంతా ఇంతా కాదన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట్లో ముంచారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా అన్ని భూములు దేనికి బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకం అని రోడ్డెక్కి విమర్శించి తీరా గెలిచాక అందినకాడికి రైతుల భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసిటీ లాంటి సెజ్‌లు వైయస్‌ఆర్‌ హయాంలో వచ్చినవి తప్ప ప్రపంచమంతా తిరిగి రాష్ట్రానికి ఒక్క పైసా పెట్టుబడులు తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. చంద్రబాబు అనాలోచితంగా పబ్లిసిటీ కోసం తీసుకుంటున్న నిర్ణయాలతో రెండున్నరేళ్ల పాలనలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని, ఇలాంటి దుస్థితికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top