‌డెల్టా రైతన్నల కల 'పోలవరం': బోస్

రాజమండ్రి, 3 అక్టోబర్‌ 2012: డెల్టాలోని అన్నదాతలందరిలో ఎప్పటి నుంచో మిగిలి ఉన్న కల, తపన పోలవరం ప్రాజెక్టు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు అత్యవసరమైనది అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, సుమారు 7.20 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా, 16 లక్షల ఎకరాలకు లిఫ్టు ద్వారా సాగునీటి ప్రయోజనం చేకూరుతుందన్నారు. చిన్న చిన్న కారణాలు చూపించి ఈ ప్రాజెక్టును ఆపడానికి ప్రయత్నాలు చేయడం తగదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సాధన కోసం కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన ఛలో పోలవరం పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కుడిపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. పోలవరం సాధన పాదయాత్రకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది.

గోదావరి జిల్లాలకే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ప్రాజెక్టు సాధన కోసం రైతులు కదం తొక్కారు. క్రాప్‌ హాలిడే స్ఫూర్తితో పాదయాత్రకు బుధవారం ఉదయం శ్రీకారం చుట్టారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది రైతులు పాదయాత్రతో పోరుబాట పట్టారు. గోదావరి మాతకు పూజలు నిర్వహించిన అనంతరం వేలాది మంది రైతులు పాదయాత్ర ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వారంతా పోలవరానికి పాదయాత్రగా బయలుదేరారు.

కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంక నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు 138 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నెల 8న పాదయాత్ర పోలవరం చేరుతుంది. అదే రోజున భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. గోదావరి జిల్లాలకే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ప్రాజెక్టును సత్వరమే చేపట్టాలని కోరారు. సాధిస్తాం... సాధిస్తాం... పోలవరం సాధిస్తాం... నినాదాలతో రైతులు కదం తొక్కారు.
Back to Top