మమతా బెనర్జీతో నేడు జగన్‌ బృందం బేటీ

హైదరాబాద్, 19 నవంబర్ 2013:

 సమైక్యాంధ్రకు జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు, రాష్ట్రాల విభజన విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతూ.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం కోల్‌కతా బయలుదేరి వెళ్ళింది. తృణమూల్ కాంగ్రెస్‌‌ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ జగన్ బృందం కలుసుకుంటుంది. అడ్డగోలుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనను నిలువరించేందుకు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమకు మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా మమతకు శ్రీ జగన్‌ బృందం విజ్ఞప్తి చేస్తుంది. పార్టీ అధికార ప్రతినిధి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల బృందంలో శ్రీ జగన్‌తో పాటు డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, బాలశౌరి, తాను కోల్‌కతా వెళుతున్నామని గట్టు రామచంద్రరావు తెలిపారు.

పార్లమెంటులో మెజారిటీ ఉందన్న ధీమాతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3ను దుర్వినియోగం చేస్తూ.. బలమైన రాష్ట్రాలను బలహీనపరిచేలా వ్యవహరిస్తున్న కేంద్రం తీరుకు వ్యతిరేకంగా శ్రీ జగన్‌, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‌సమైక్యాంధ్రకు జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం శని, ఆదివారాల్లో ఢిల్లీ వెళ్ళి సీపీఐ, సీపీఎం, బీజేపీ అగ్ర నాయకులతో సమావేశమైన విషయం తెలిసిందే.

Back to Top