దళారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం:నాగిరెడ్డి

హనుమాన్‌ జంక్షన్‌ (కృష్ణాజిల్లా): అన్నదాతకు సంకెళ్లు, దళారులకు పడిపడి దండాలు అన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వహరిస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి విమర్శించారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నవిధానాల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సహకరిస్తే రైతులు పంటలు పండించడమే కాకుండా అధిక దిగుబడులు వచ్చేలా చేస్తారన్నారు.  ప్రభుత్వాలు వ్యాపారసంస్థల్లా మారి వివిధ పంటల ఎగుమతులు నిషేధించి రైతుకు ధర రాకుండా చేస్తున్నాయని ఆరోపించారు.

     ప్రభుత్వం అవసరాలకు మించి లెవీ బియ్యం సేకరిస్తోందన్నారు.  ఆ బియ్యం ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసి ఇక్కడ రైతుల్ని ఆత్మహత్యలకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారం, వజ్రాలపై ఒకశాతం పన్ను విధిస్తే, రైతులు పండించే పంటలకు రకరకాల పన్నులు 10 నుండి 12 శాతం వరకు విధించడంతో వ్యాపారులు ఆ భారం రైతులపైనే వేస్తున్నారన్నారు. దాంతో వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తుల్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. గిట్టుబాటు ధర కల్పించకపోగా రైతుకయ్యే ఖర్చు విషయంలో దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు అయ్యే వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని సగటు ఉత్పత్తి వ్యయం నిర్ణయించడం దారుణమన్నారు.

     ఏ రాష్ట్రంలో పంట ఉత్పత్తి వ్యయాన్ని ఆ రాష్ట్రంలోనే తీసుకుని మద్దతు ధర నిర్ణయించే పద్ధతి పాటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 80 శాతం వ్యవసాయ భూములను కౌలు రైతులే పండిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానల వల్ల గిట్టుబాటు ధరరాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విధానాల మార్పు కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు.

Back to Top