జగనన్నను ఆపడం వారి తరం కాదు

కె.కొత్తకోట (విశాఖ జిల్లా),

1 జూలై 2013: జగనన్నను ఆపే దమ్మూ కాంగ్రెస్‌, టిడిపిలకు లేదని శ్రీమతి షర్మిల ధీమాగా చెప్పారు. కిరణ్ ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధ లేదని‌, పేదలంటే కనికరం లేదని మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ‌తనయ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆరోపించారు. రైతులు పేదలంటే ఇంత చిన్నచూపు చూస్తున్న వీళ్ళు పాలకులా? లేక రాక్షసులా? అని ఆమె ప్రశ్నించారు. శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం ఉదయం విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని‌ కె.కొత్తకోట చేరుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. శ్రీమతి షర్మిల రాక సందర్భంగా కె.కొత్తకోట జనసంద్రంగా మారింది. ఆమె పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  శ్రీమతి షర్మిల అధికార, ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

పంటకు సక్రమంగా కరెంటు, నీరు అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కిరణ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి‌స్తున్నదని శ్రీమతి షర్మిల ఆరోపించారు. వేసిన పంట చేతికి రాక, వచ్చినా మద్దతు ధర లేక, అప్పులపాలైపోయి దిగులుతో కుంగిపోతున్న రైతన్న చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కిరణ్‌ ప్రభుత్వానికి మనసు, మానవత్వం లేవని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయంలో రైతు సమస్యలపై ఆయన స్పందించిన తీరును శ్రీమతి షర్మిల ఎండగట్టారు. గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీని, ప్రైవేటు పరం చేయడానికి, దాన్ని అమ్మేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డారని విమర్శించారు. కానీ వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి కాగానే దానికి నిధులిచ్చి నిలబెట్టారని ఇప్పుడది లాభాల్లో నడుస్తోందన్నారు. వైయస్‌ సిఎంగా ఉన్న సమయంలో చెరకు మద్దతు ధర పెంచారని రైతులు తనకు చెబుతుంటే ఎంతో సంతోషం కలుగుతోందని శ్రీమతి షర్మిల తెలిపారు.

ప్రజలను ప్రేమించిన వ్యక్తి వైయస్‌ఆర్‌. రైతు ప్రతి అవసరాన్ని గుర్తించి ఆదుకున్నదీ ఆయనే. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందించిన ఘనత వైయస్‌ఆర్‌దే. ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలని ఆయన తపించారన్నారు. విద్యార్థులను ఆయన ఒక కన్న తండ్రి స్థానంలో ఉండి ఆలోచించారని, ప్రతి విద్యార్థినీ ఉచితంగా ఉన్నత చదువులు చదివించారని గుర్తుచేశారు. రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత రాజశేఖరరెడ్డిదే అన్నారు. చంద్రబాబు నాయుడు రైతులు, మహిళలకు రూపాయికి పైగా వడ్డీకి రుణాలు ఇచ్చేవారని, మహానేత వైయస్‌ సీఎం అయ్యాక కేవలం పావలా వడ్డీకే రుణాలు అందించారని పేర్కొన్నారు. దీనితో ఎందరో మహిళలు పావలా వడ్డీ రుణాలు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించారని తెలిపారు. ఏ పథకాన్నయినా రాజశేఖరరెడ్డిగారు అద్భుతంగా అమలు చేసి చూపించారని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ చార్జీలు, ధరలూ ఒక్క రూపాయి కూడా పెంచకుండానే పథకాలను అమలు చేసిన రికార్డు సిఎంగా నిలిచారని అన్నారు.

కానీ, రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత కిరణ్ ప్రభుత్వం అటక ఎక్కించిందని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ప్రజలు ఏది కొనాలన్నా, తినాలన్నా ధరలు అందుబాటులో లేకుండా కొండెక్కి కూర్చున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కిరణ్‌ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి జబ్బుచేసిందన్నారు. 108, 104 వాహనాలు కనుమరుగైపోతున్నాయని అన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు కుంటుపడిందన్నారు. పక్కా ఇళ్ళ పథకానికి పాడె కట్టిందని దుయ్యబట్టారు. అన్ని ధరలూ పెరిగిపోయిన ఈ తరుణంలో వైయస్‌ హయాంలో ఇచ్చిన పింఛన్లు కూడా ఈ ప్రభుత్వం ఆపేస్తున్నదని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చెబుతుంటే చాలా బాధ అనిపిస్తోందన్నారు. పదిహేను వేల ఎకరాల ఆయకట్టు ఉన్న రైవాడ జలాశయాన్ని ఆధునికీకరణ చేయాలని రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు అనుకున్నారని తెలిపారు. అందుకోసం నిధులు కేటాయించారని, 65 శాతం పనులు కూడా పూర్తిచేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పటి వరకూ మిగతా పనులు పూర్తి కాలేదని, దానితో తమ పొలాలకు సాగునీరు రాక రైతులు బాధలు పడుతున్న వైనాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు.

కరెంటు ఇవ్వకుండా‌నే బిల్లులు పెంచి మరీ వసూలు చేయడం తగదన్న ఇంగితం కూడా కిరణ్ ప్రభుత్వానికి లేదని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని చార్జీలు, పన్నులు, ధరలు పెంచేసి ప్రజల నడ్డి విరుస్తున్నదని విమర్శించారు. పెంచిన కరెంటు చార్జీలు రూ. 32 వేల కోట్లు ప్రజల రక్తం పిండి మరీ వసూలు చేస్తోందని విమర్శించారు. కరెంటు కోతకు, చార్జీల మోతకు నిరసనగా అన్ని ప్రతిపక్షాలూ కలిసి అవిశ్వాసం పెడితే ప్రధాన ప్రతిపక్షం అధ్యక్షుడు చంద్రబాబు ఈ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదంటూ నిస్సిగ్గుగా విప్‌ జారీ చేసి మరీ కూలిపోకుండా కాపాడారని విమర్శించారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఇప్పుడు మన నెత్తిన కరెంటు చార్జీల మోత, ధరల భారం ఉండేదే కాదన్నారు. 'రాబందుల రాజ్యం ఏలుతుంటే.. గుంట నక్కలు తాళం వేసిన చందం'గా కాంగ్రెస్‌, టిడిపిల తీరు ఉందని ఎద్దేవా చేశారు.

వ్యవసాయం దండగ అని, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని చంద్రబాబు నాయుడు పిచ్చిలెక్కలు వేసి చూపించారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు పాపం ఊరికే పోదని శాపనార్థాలు పెట్టారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని, సోమరిపోతులవుతారన్నారని విమర్శించారు. ప్రతి ఏటా కరెంటు చార్జీలు పెంచుతానని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని సంతకాలు పెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు.‌ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని మహానేత వైయస్‌ చెప్పినప్పుడు అవహేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు తానూ ఇస్తానంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. 'అర్జెంటుగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అర్జెంటుగా చార్జీలు పెంచి, వాటిని ప్రజల నుంచే సున్నితంగా వసూలు చేయాలి. ప్రజల దగ్గర నుంచే డబ్బులు సేకరించాలి. అర్జెంటుగా ఆదాయాన్ని పెంచుకోవాలి' అంటూ చంద్రబాబు నాయుడు తన 'మనసులో మాట' పుస్తకంలో రాసుకున్న అంశాలను శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా చదివి వినిపించారు. రెండెకరాల ఆసామీ చంద్రబాబుకు మన దేశంలో ఎక్కడ చూసినా వేల కోట్ల రూపాయలతో హెరిటేజ్‌ శాఖలు ఎలా పెట్టారని ప్రశ్నించారు. ఆయనకు దేశ విదేశాల్లో ఆస్తున్నాయన్నారు. అధికార దాహం, ధన కాంక్ష, రంగులు మార్చడం అనే లక్షణాలు చంద్రబాబు రక్తంలోనే ఉన్నాయని ఎన్టీఆర్‌ అన్నారని ఉటంకించారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక విధానంతో టిడిపి పుడితే దానితోనే చంద్రబాబు పదే పదే కుమ్మక్కయ్యారని విమర్శించారు.

కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కై, జగనన్నపై కుట్రలు చేసి, అబద్ధపు కేసులు పెట్టి, సిబిఐని ఉసిగొల్పి అరెస్టు చేయించాయని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న జనం మధ్యనే ఉంటే, వైయస్‌ఆర్‌ వారసునిగా స్థిరపడుతుంటే.. ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదని, తమ దుకాణాలు మూసేసుకోవాలనే కుట్ర చేశాయన్నారు. కానీ.. బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. మంచివారి పక్షాన దేవుడు నిలబడతాడన్నది నిజం అన్నారు. ఉదయించే సూర్యుడ్ని అపలేనట్లే జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరన్నారు. జగనన్నను ఆపడం టిడిపి, కాంగ్రెస్‌ నాయకుల తరం కాదన్నారు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారని, మనందర్నీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తారని తెలిపారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ఎకరాకు సాగునీరందించాలన్న వైయస్‌ఆర్‌ కలలను సాకారం చేస్తారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగేలా పథకాలు అమలు చేస్తారని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటల కోసం రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. జగనన్న సిఎం అయ్యాక రైతులు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు అందిస్తారని హామీ ఇచ్చారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అవుతుందని, ఆ రోజు వచ్చే వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు 'జనం మెచ్చిన జగన్' ఆడియో సి.డి.ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. www.YSFANCLUB.com నుంచి ఈ సిడిలోని పాటలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Back to Top