కాంగ్రెస్‌ నాయకుల ఉత్తర కుమార ప్రగల్భాలు

హైదరాబాద్, 1 ఆగస్టు 2013:

రాష్ట్రాన్ని విభజిస్తే.. తమ తడాఖా చూపిస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. విభజన జరిగి మూడు రోజులవుతున్నా వారు మీనమేషాలు లెక్కబెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన గురించి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణకు ముందే తెలుసని ఆయన అన్నారు. పలువురు రాష్ట్ర మంత్రులతో అహ్మద్‌ పటేల్‌ పలుమార్లు ఫోన్‌లో చెప్పిన విషయం కూడా అందరికీ తేటతెల్లం అయిందన్నారు. హైదరాబాద్‌లో భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్ర విభజన ద్రోహులైన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు నిస్సిగ్గుగా ఆ దోషాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మపైకి నెడుతున్నారని భూమన నిప్పులు చెరిగారు.‌ రాష్ట్ర విభజనకు సంబంధించి డిసెంబర్ 9న అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటించినప్పుడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే ఏర్పాటు కాలేదని ఆయన గుర్తుచేశారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటయ్యే సమయానికీ పార్టీ ఏర్పాటవ్వలేదన్నారు. చిదంబరం ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశానికీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను పిలవలేదన్నారు. ఇలా ఏ సందర్భంలోనూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పాత్ర లేదన్నారు. 2012 డిసెంబర్‌లో జరిగిన ఒకే ఒక్క అఖిలపక్ష సమావేశానికి మాత్రమే పార్టీ ప్రతినిధులుగా డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి, కె.కె. మహేందర్‌రెడ్డి హాజరైన వైనాన్ని భూమన గుర్తుచేశారు. ఆ సమావేశంలో పార్టీ అభిప్రాయాలను చాలా విస్పష్టంగా వారు చెప్పారన్నారు.

వైయస్ఆర్‌ పార్టీని ఎక్కడా భాగస్వామిని చేయకుండా, ఎక్కడా పిలిచే ప్రయత్నమే చేయకుండా విభజనను నెత్తికెత్తుకుని చేసిన కాంగ్రెస్‌ నాయకులు ఈ రోజు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద అభాండాలు వేస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మీద బురద జల్లితే సహించబోమన్నారు. విభజన అసలు ద్రోహులు కాంగ్రెస్‌ పార్టీ నాయకులే అన్నారు. విభజన జరుగుతుందని ముందే సంకేతాలు అందినా ఏమాత్రం నోరు మెదపకుండా, మా నాయకురాలు మాకు అనుకూలంగా చేస్తుంది.. మేం చెప్పినట్టే వింటుంది.. మేం చెప్పిన వాటిని సావధానంగా విన్నారని పత్రికా సమావేశాల్లో అబద్ధాలు చెబుతూ.. ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ముందే తెలిసిన వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయకుండా మూడు రోజుల తరువాత స్పందించడం అంటే ఇంత కన్నా దుర్మార్గమైన విషయం లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజనపై రేపు జరిగే కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్ళంరాజులకు ధిక్కరించే శక్తి, ధైర్యం ఉన్నాయా? అని భూమన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు, సీట్ల కోసం అవకాశవాదంతో ఆలోచించి, కోస్తాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను కించపరిచిందని నిప్పులు చెరిగారు. ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించిన తీరును వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ స్పష్టంగా తెలియజెప్పిందన్నారు. అందుకే తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని చెప్పారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top