'ఫోన్ ట్యాపింగ్ నేర్పింది చంద్రబాబే'

హైదరాబాద్: టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ కుమ్మక్కైయ్యాయన్న టీడీపీ విమర్శలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖండించారు.  టీఆర్ఎస్ కండువా కప్పుకున్నది... కలసి ఎన్నికల్లో పాల్గొన్నది టీడీపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్లో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ... ఈ రోజు టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ కుమ్మక్కైందని అనడం తగదని  అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఆ తప్పును ఆంధ్రుల తప్పుగా చూపిస్తున్నారని విమర్శించారు. అక్రమ సంపాదనకు వారసుడు లోకేష్ అయితే... బాబు చేసిన తప్పులు ఆంధ్ర ప్రజలవా ?  ఇదేక్కడి న్యాయం అని చెవిరెడ్డి ప్రశ్నించారు.

పట్టిసీమ డబ్బులు తెచ్చి... ఎమ్మెల్యేలను కొనబోయి అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసే సిద్దాంతం మీది కాదా? రాష్ట్రానికి ఫోన్ ట్యాపింగ్ నేర్పింది చంద్రబాబే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 70 మండలాల్లోని ఎంపీటీసీలను కొనుగోలు చేశారని... అలాగే కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన జడ్పీటీసీలను కొన్నారని చెవిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఇద్దరు ఎంపీలను మీ పార్టీలోకి తీసుకెళ్లినది నిజం కాదా? అని మరో సారి టీడీపీ నేతలను ప్రశ్నించారు.

కాగా తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం రోడ్డు ప్రమాద మృతలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రకటించారు. 
Back to Top