ప్రధాని చేతిలో ఇద్దరు సీఎంల జుట్టు?

  • తెలుగు రాష్ట్రాల్లో రైతులు అప్పుల పాలు
  • బాబు, కేసీఆర్ లు సంక్షేమాన్ని విస్మరించారు
  • రైతులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి
  • టీ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల జుట్టు ప్రధాని మోడీ చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో రైతులు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాల్లో ఏపీ నంబర్‌ వన్, తెలంగాణ నంబర్‌ టూ స్థానాల్లో నిలవడం బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల ముందు రైతుల రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, కేసీఆర్‌ మాట తప్పారన్నారు. వీరి మాటలు నమ్మిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని తెలిపారు. ఇది తాము చెప్పేది కాదని, తెలుగు రాష్ట్రాల రైతాంగం అప్పుల ఊబిలో ఉన్నట్లు జాతీయ సర్వేలో వెల్లడైందని చెప్పారు. 

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిన కేసీఆర్‌ ఇద్దరూ కూడా ప్రధాని మోడీ చేతికి చిక్కారన్నారు. ఈ నెపంతో ఇద్దరు సీఎంలు రైతుల సంక్షేమాన్ని విస్మరించి, సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ రూ. 60 కోట్లతో ఇంద్రభవన్‌ నిర్మించుకొని, దానికి  ప్రగతి భవన్‌ పేరు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది చాలదన్నట్లు ఇవాళ జిల్లా కలెక్టర్లపై రోజంతా సమీక్షల పేరుతో కాలయాపన చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక 43 అంశాలపై తీర్మానం చేసిందని, వీటి అమలుపై ఇంతవరకు సమీక్షలు నిర్వహించలేదని, ఆరోగ్యశ్రీ, పెండింగ్‌ ప్రాజెక్టులు, పేదలకు మూడు ఎకరాల భూమి వంటి వాగ్ధానాలపై ఎందుకు సమీక్షలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఇంద్రభవనం కట్టుకున్న కేసీఆర్‌ రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని మండిపడ్డారు.  రైతులపై కేసీఆర్‌ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. బ్యాంకులు రుణాలిచ్చి రైతులను ఆదుకోవాలని రాఘవరెడ్డి కోరారు. 
 
Back to Top