చట్టాలు చేస్తేనే సరిపోదు.. చిత్తశుద్ధి ఉండాలి

మహబూబ్‌నగర్‌:: శాసనసభలో చట్టాలు చేయడం, పథకాలు ప్రవేశపెట్టడం ఒక్కటే చాలదని, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజల బాధలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ‌ం, దానితో అంటకాగి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర 48వ రోజు మంగళవారం రాత్రికి మహబూబ్‌నగర్ పట్టణానికి చే‌రుకుంది. పట్టణంలోని క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

‘మన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును అసెంబ్లీలో హడావుడిగా ప్రవేశపెట్టి ఎంతో గొప్ప పని చేశానని గొప్పగా చెప్పుకుంటున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఒక మాట చెప్తున్నా. అభివృద్ధి అనేది చట్టాల వల్ల మాత్రమే జరగదు. చట్టాలు, సంక్షేమ పథకాలను.. అభివృద్ధి కార్యక్రమాలను చిత్తశుద్ధితో ఒకేసారి అమలు చేయగల నాయకత్వం వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది. ఈ విషయాన్ని మేం కిరణ్‌ కుమార్‌రెడ్డికి చెప్పాల్సి రావడం మన దురదృష్టం’ అని శ్రీమతి షర్మిల విమర్శించారు. ‘విద్యార్థుల మెస్ చార్జీలు పెంచగలిగినవారు.. అదే హాస్ట‌ల్ విద్యార్థుల కడుపు నిండా ఆహారం వండేందుకు హాస్టళ్ళకు సరిపడినన్ని గ్యా‌స్ సిలిండర్లు ఎందుకు ఇవ్వడం లేదు? వారికి దళితులు, గిరిజనుల మీద ప్రేమ ఉంది అని చెప్పుకుంటున్నారు.‌ నిజంగా ప్రేమే ఉంటే దళితుల కష్టాలు ఈపాటికే వారికి కనిపించేవి’ అని ఆమె అన్నారు.

అన్నదాతలను జైల్లో పెట్టి అవమానించిన చంద్రబాబు:
‘టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఒక పుస్తకం రాసుకున్నారు. దాని పేరు ‘మనుసులో మాట’.. ఆయన మనసులో మాట. జల ప్రాజెక్టులు కట్టడం నష్టమట.. వ్యవసాయం శుద్ధ దండగట.. ప్రజలకు ఏమీ ఉచితంగా ఇవ్వకూడదట.. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులుగా మారుతారట.. ఇదీ చంద్రబాబు పుస్తకంలో రాసుకున్నది. చంద్రబాబు తొమ్మిదేళ్లలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారు. కరెంటు బిల్లులు కట్టని రైతులను, మహిళలను జైల్లో పెట్టించారు. ఈ అవమానాలను తట్టుకోలేక, బకాయిలు కట్టలేక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని చంద్రబాబుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు మళ్లీ పాదయాత్ర పేరుతో గ్రామాల్లోకి వస్తున్న బాబు.. రకరకాల హామీలు ఇస్తున్నారు.‌ దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ అమలు చేసిన రైతు రుణాల మాఫీ, ఫీజు రీయింబ‌ర్సుమెంటు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను తాను కూడా అమలు చేస్తానని బాబు ఇప్పుడు వాగ్దానాలు చేస్తున్నార'ని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు.

'అయ్యా.. చంద్రబాబూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది మీ వ్యవహారం. మీరు ఎన్ని వాతలు పెట్టుకున్నా.. నక్క నక్కే..పులి పులే ’ అని దుయ్యబట్టారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. ప్రజల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయవచ్చన్నారు. కానీ ఆయన ప్రభుత్వంతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టనుగాక పెట్టను అంటున్నారని విమర్శించారు.

నియోజకవర్గం ప్రజలను మరిచిపోయిన కేసీఆర్‌:: :
మహబూబ్‌నగర్ ‌లోక్‌సభ సభ్యుడు, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తనను గెలిపించిన ప్రజ‌లను పూర్తిగా మరిచిపోయారని శ్రీమతి షర్మిల విమర్శించారు. కేసీఆర్‌ ఏనాడూ తన నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ‘ఇక్కడ ప్రస్తుతం ప్రధానమైన సమస్య నీటి సమస్య. ఎక్కడికి పోయినా మహిళలు తాగడానికి నీళ్లు లేవు అంటున్నారు. ఏ రోజైనా కేసీఆర్.. ఓటేసిన ప్రజల దిక్కు చూశారా? అని అడుగుతున్నా! తనకు ఓటేసిన ప్రజలు ఎలా ఉన్నారు?.. తింటున్నారా? బతికి ఉన్నారా? అని ఆయన ఒక్కసారంటే ఒక్కసారైనా తిరిగి చూశారా? ఒక్కరోజైనా ప్రజల సమస్యల గురించి మీరు పోరాటాలు చేశారా? ఆడవాళ్లయితే రెండు మూడు కిలోమీటర్లు వెళ్లి తాగడానికి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మహిళ కన్నీటి కష్టాలు ఒక్కసారంటే ఒక్కసారి కూడా కేసీఆర్ కంటికి కన్పించలేదు’ అని దుయ్యబట్టారు.
Back to Top