బాబుగారి కరెంటు షాకులు

నిన్న రు.575 కోట్ల చార్జీల వాతలు
నేడు ఉచిత విద్యుత్ కత్తిరింపునకు ఎత్తులు

హైదరాబాద్: బాబు వచ్చాడు... మళ్లీ కష్టాలు వచ్చాయి... బాబు వచ్చాడు మళ్లీ చార్జీలు పెరిగాయి.... బాబు వచ్చాడు... మళ్లీ ఉద్యోగాలు ఊడాయి... అనే పద్ధతిలో పదకొండు నెలలుగా పాలన సాగుతోంది. కరెంటు చార్జీలు పెంచడమే కాదు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ను పెంచడం ద్వారా కూడా తాను పేదల వ్యతిరేకిని అని చంద్రబాబునాయుడు నిరూపించుకున్నారు. రైతుకు భరోసా ఇచ్చే ఎలాంటి చర్యలూ చేపట్టకపోగా వారిని మరింత ఊబిలోకి నెట్టేసే విధానాలనే చంద్రబాబు అనుసరిస్తున్నారు. తాజాగా ఉచిత విద్యుత్‌ను కత్తిరించేందుకు ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. ఇందుకోసం అనువైన మార్గాలను అన్వేషించాల్సిందిగా అధికారులను పురమాయిస్తున్నారు.

భారాలు.. కాల్పులు.. బాబు ఘనత
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పైసా విద్యుత్ చార్జీలు పెంచబోమని 2013-14లో పెంచిన విద్యుత్ చార్జీలను కూడా తగ్గిస్తామని 2013 ఏప్రిల్ 2న కాకినాడలో చంద్రబాబునాయుడు ఘనంగా ప్రకటించారు. అయితే అధికారంలోకి రాగానే ఈ వాగ్దానాన్ని ఆయన తుంగలో తొక్కేసారు. 1994 నుంచి 2004 వరకు రాష్ట్రాన్ని ఏలిన చంద్రబాబు నాయుడు ఏటా కరెంటు చార్జీల వాతలు పెట్టే విధానాన్నే అనుసరించారు. బాబు హయాంలో కరెంటు చార్జీలు పెరగని సంవత్సరమే లేదు. చివరకు కరెంటు చార్జీల పెంపును ఉపసంహరించాలని కోరుతూ ఆందోళన చేసిన ఉద్యమకారులపై కాల్పులు జరిపి నలుగురి ప్రాణాలను హరించిన చరిత్ర చంద్రబాబునాయుడిది.
భారాలు లేని వైఎస్ స్వర్ణయుగం
2004-2009 మధ్య డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 నెలల కాలంలో మాత్రమే రాష్ర్టంలో ఏ ఒక్క కేటగిరీకి ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. 2004-2009 మధ్య రైతులకు సరఫరా చేసిన ఉచిత విద్యుత్ 800 కోట్ల యూనిట్ల నుంచి 1400 కోట్ల యూనిట్లకు పెరిగినా ఆ 5 ఏళ్లలో ఒక్క పైసా విద్యుత్ చార్జీలు కూడా పెంచలేదు. ఆర్టీసీ చార్జీలు, పన్నులు పెంచని ఏకైక సువర్ణయుగం వైఎస్ పాలించిన కాలం.
వైఎస్ తర్వాత భారాలే...
వైఎస్ మరణం తర్వాత పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చంద్రబాబు బాటలోనే నడిచారు. వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలమీద మోపారు. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు టన్నుకు 130 నుంచి 140 డాలర్ల మధ్య ఉండడాన్ని కారణంగా పేర్కొన్నారు.  క్రూడ్ ఆయిల్ ధరలు ఒకప్పటి 110 డాలర్ల నుంచి బ్యారెల్‌కు 50 డాలర్లకు పడిపోయింది. బొగ్గు ధరలు కూడా 130-140 డాలర్ల నుంచి 62 డాలర్లకు పడిపోయాయి. అలాంటి సమయంలో కరెంటు చార్జీలు తగ్గించాల్సింది పోయి పెంచడానికే చంద్రబాబు మొగ్గు చూపారు. అంటే పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడమంటే చంద్రబాబుకు ఎంత ఇష్టమో ఇది రుజువు.
 
2013 ఏప్రిల్ 2న కాకినాడలో చంద్రబాబు చెప్పిందిదీ...
పెంచిన కరెంటు చార్జీలను బేషరతుగా తగ్గించాలి. లేదంటే ప్రభుత్వం నుంచి వైదొలగాలి. విద్యుత్ చార్జీల పెంపు ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనం. ప్రభుత్వ చేతకాని తనానికి ప్రజలు పరిహారం చెల్లించాలా? పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు సర్కారుపై తిరగబడాలి. విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. 
 .....అలాంటి చంద్రబాబు అధికారంలోకి రాగానే మరలా వెంటనే తన నిజస్వరూపాన్ని బైటపెట్టుకున్నారు. ఆరోజు చంద్రబాబు ఇచ్చిన పిలుపును ఈరోజు ప్రజలు పాటించాలి కదా. ప్రభుత్వంపై తిరగబడాలి కదా..
 
ఉచిత విద్యుత్‌కు బాబు కత్తెర?
చార్జీల వాతలే కాదు ఉచిత విద్యుత్‌కు కత్తెర వేసి రైతులకు మరో షాక్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహాలు పన్నుతున్నారు. విద్యుత్ శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉచితవిద్యుత్ నియంత్రణ పైనే ప్రధానంగా దృష్టిపెట్టారట. పంపిణీ, సరఫరా నష్టాల్ని 10 శాతం నుంచి 9 శాతానికి ఎలా తగ్గించాలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారట. అంటే ఉచిత విద్యుత్‌కు దశల వారీగా కత్తెర వేయడమే మార్గమని ఆయన పరోక్షంగా సూచించారని అధికార వర్గాలంటున్నాయి. ఇందులో భాగంగా విద్యుత్ ఫీడర్లకు మీటర్లు బిగించాలని సూచించారని, అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానించాలని ఆదేశించారని అధికారులు చెబుతున్నారు. రాష్ర్టంలోని 15 లక్షల వ్యవసాయ విద్యుత్ పంపుసెట్ల స్థానంలో నాణ్యమైన పంపుసెట్లను అమరిస్తే ఎంత ఖర్చవుతుందో నివేదించాలని అధికారులను చంద్రబాబు కోరారు. నాణ్యమైన పంపుసెట్లను అమర్చడమంటే అదేదో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అనుకుంటే పొరపాటే. అలాంటి నాణ్యమైన పంపుసెట్లను అమర్చితేనే ఎవరు ఎంత విద్యుత్ వాడుతున్నారో లెక్కలేయవచ్చు. రైతులు వాడుతున్న విద్యుత్ ఆధారంగా కత్తెర వేయవచ్చు లేదంటే ఇంత కట్టాలి అని బిల్లు పంపవచ్చు. అదీ బాబుగారి ఆలోచన.
Back to Top