చంద్రబాబు లేఖ చారిత్రక తప్పిదం

హైదరాబాద్, 29 ఆగస్టు 2013:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలం‌గా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ ఇవ్వడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం తప్పపట్టారు. విభజన విషయంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించడంపై ఆయన నిప్పులు చెరిగారు. తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలన్న పునాదులపై ఏర్పాటైన టిడిపి విభజనకు లేఖ ఇవ్వకపోవడం అన్నది చారిత్రక కర్తవ్యం అన్నారు. రాష్ట్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవడం, కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉండడమే రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన గురువారం పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని శ్రీమతి విజయమ్మ నివాసంలో జరిగిన కార్యక్రమంలో సీతారాంకు శ్రీమతి విజయమ్మ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పులి జూదం :
రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోవడానికి కారణం కేంద్రప్రభుత్వం కాదా అని తమ్మినే సీతారాం ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ తాను ఆడుతున్న రాజకీయ పులి జూదంలో భాగంగా మన రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన పరిస్థితి ఉందన్నారు. అధికార స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజిస్తారా? అని ఆయన సోనియా గాంధీని నిలదీశారు. సిడబ్ల్యుసి నిర్ణయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తామంటున్న కాంగ్రెస్‌ పార్టీ దేశంలో మరో 25 కొత్త రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయని వాటిని ఎందుకు ఇవ్వరని నిలదీశారు. వింధ్యప్రదేశ్‌ కోసం మధ్యప్రదేశ్‌లో ఉద్యమం జరుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదని దిగ్విజయ్‌ సింగ్‌ను సీతారాం ప్రశ్నించారు. దక్షిణ మద్రాస్‌ రాష్ట్రం కావాలంటూ తమిళనాడులో చిరకాలంగా పోరాటం జరుగుతోందని దాన్నెందుకు ఏకవాక్య తీర్మానంలో చేయలేకపోయారని చిదంబరాన్ని నిలదీశారు. యుపిని నాలుగు రాష్ట్రాలు చేయమని అసెంబ్లీలో మాయావతి ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఎందుకు అమలు చేయడంలేదన్నారు. టిఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టటానికి కాంగ్రెస్‌ నడుంకట్టిందన్నారు.

పిచ్చి కుదరాలంటే.. పెళ్ళి చెయ్యాలి :
రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించే నీచానికి సోనియా గాంధీ ఒడిగట్టారని తమ్మినేని విమర్శించారు. మా రాష్ట్రాన్ని విభజించడం కాదు ముందు మీ కుమారుడికి పెళ్ళి చేయండని సోనియాకు ఆయన సూచించారు. పెళ్ళయితే పిచ్చి కుదురుతుందన్న పెద్దల సామెతను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

జనం కోసమే ఉద్యమిస్తున్న వైయస్‌ కుటుంబం :
ప్రజల కోసం పోరాడుతున్న కుటుంబం వైయస్ఆర్‌ కుంటుంబం అన్నారు. అక్రమంగా జైలులో నిర్బంధించిన శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కుటుంబం మాత్రమే రాష్ర్ట ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నారని తమ్మినేని చెప్పారు. శ్రీమతి వైయస్‌ షర్మిల 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ మహిళా సాహసించని విధంగా ప్రజల సమస్యలను స్పృశిస్తూ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేయలేదన్నారు. అందుకే శ్రీమతి షర్మిల 'ఉక్కు మహిళ' అని ఆయన అభివర్ణించారు. ఆరుపదుల వయస్సుకు చేరువలో ఉన్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ చేస్తున్న పోరాటాన్ని అందరం అభినందించాలన్నారు. జైలులో ఉన్నప్పటికి జనం కోసమే శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్న వైనాన్ని తమ్మినేని ప్రస్తావించారు.

ప్రజల కోసమే ఉద్యమిస్తున్న నాయకుడే శ్రీ జగన్‌ అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ సేవ చేస్తామని శ్రీమతి విజయమ్మకు శ్రీకాకుళం జిల్లాలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులందరం స్పష్టంగా చెప్పామని తమ్మినేని సీతారాం తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని తెలిపారు.

తలాడిస్తున్న సీల్డు కవర్‌ సిఎం కిరణ్ :
రాష్ట్రాన్ని, తెలుగు జాతిని ఎన్టీఆర్‌ సమైక్యంగా ఉంచారన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మన రాష్ట్రంలో విభజన అనే మాటే రాని వైనాన్ని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. వారు సమర్ధులైన, ప్రజల్లోంచి వచ్చిన నాయకులన్నారు. ప్రజల కోసమే బ్రతికిన వారన్నారు. సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అది ఎంపిక వల్ల జరిగేది కాదన్నారు. అది సీల్డు కవర్‌ సిఎంల వల్ల సాధ్యం కాదన్నారు. సీల్డు కవర్‌ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పెద్దలు చెప్పిన దానికి తలాడించి, రాష్ట్రానికి వచ్చి రెండో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీ జగన్మోహన్‌రెడ్డి లాంటి సమర్ధుడైన నాయకుడు రావాలన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో‌ తనను చేర్చుకున్నందుకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మలకు తమ్మినేని సీతారాం కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top