అసలైన దోపిడీదారు చంద్రబాబే

హైదరాబాద్ 10 జూలై 2013:

కొన్ని పత్రికలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పనిగట్టుకుని బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాయని పార్టీ నేత, తాజా మాజా ఎమ్మెల్యే అయిన జోగి రమేష్ మండిపడ్డారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పచ్చ పత్రికలన్నీ ఇలాంటి వార్తలను తెచ్చి పార్టీపై బురద జల్లుతున్నారని ఆయన చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వైఖరిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది అంతర్రాష్ట్ర నేరస్థులుగా ముద్ర పడిన వారితో చంద్రబాబు తీయించుకున్న ఫొటోలను రమేష్ చూపించారు. దీన్ని బట్టి చంద్రబాబును కూడా అంతర్రాష్ట్ర నేరస్థుడని అనుకోవాలా అని ప్రశ్నించారు. లేకపోతే అంతర్రాష్ట్ర దొంగనుకోవాలా? కొంతమంది టీడీపీ నేతలు తమ పార్టీని దోపిడీ, దొంగల పార్టీ అని విమర్శించారనీ.. వాస్తవానికి ఈ రాష్ట్రంలో నిజమైన దోపిడీదారు చంద్రబాబేనని రమేష్ తెలిపారు. అలాగే రాజకీయాలలో హత్యలకు పాల్పడేవారెవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు గార్ని చంద్రబాబు హత్యచేయలేదా అని ప్రశ్నించారు. ఆయనెలా చనిపోయారో రాష్ట్ర ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. మానసిక క్షోభకు గురిచేసి చంద్రబాబు ఆయనను హత్య చేయలేదా అని అడుగుతున్నానన్నారు. కత్తి, కర్ర లాంటివి ఏమీ అవసరం లేకుండా హత్యలు చేయగలిగిన వాళ్ళెవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడేనని స్పష్టంచేశారు.

ప్రతిపక్ష నేతగా కూడా దోపిడీ చేసే ఘనత చంద్రబాబుకు ఉందని చెప్పారు. ఎఫ్.డి.ఐ.లకు మద్దతుగా రాజ్యసభలో ఓటింగ్ పెట్టినప్పుడు తమ సభ్యులను బయటకు పంపినందుకు గానూ విదేశీ సంస్థలనుంచి ఎంత లంచం తీసుకున్నావు చంద్రబాబూ అని రమేష్ నిలదీశారు. తమ పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు పారిపోయినందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ నుంచి తీసుకున్నావని ప్రశ్నించారు. మహానాడు నిర్వహణకు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారని అడిగారు.  ఈ సొమ్మును దాచుకోవడానికి బాబు అమెరికా వెళ్ళలేదా అని అడుగుతున్నానన్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న బాబుకు తమ పార్టీపై నింద వేయడం వల్లకాదన్నారు. దమ్మూ, ధైర్యం లేకనే ఉప ఎన్నికలనుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలలో 80 శాతం స్థానాలను గెలుచుకునే అవకాశమున్న తమపై అభాండాలు న్యాయమా అని అడుగుతున్నానన్నారు.  మీ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని స్పష్టంచేశారు. ప్రజలు మిమ్మల్ని నమ్మరనీ, విశ్వసించరనీ పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడుగారు అధికారంలో ఉన్నప్పుడు యూరో లాటరీ విజేత కోలా కృష్ణమోహన్ గెలుచుకున్న సొమ్ము రాష్ట్రానికి రావడం కోసం ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ నగరంలో దొంగ నోట్లు, స్టాంపు పేపర్ల కుంభ కోణంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లోని మంత్రి కృష్ణయాదవ్ అరెస్టయిన సంగతినీ ఎవరూ మరిచిపోలేదన్నారు. తూర్పు గోదావరి  జిల్లాకు సంబంధించిన వ్యవసాయ సహకార సంఘం అధికారి ఒకరు తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని లేఖ రాసిన నాలుగురోజులకు చంద్రబాబు పాదయాత్రలో ప్రత్యక్షమైన అంశాన్నీ, ఆయనపై రైతులు దాడి చేసిన ఉదంతాన్ని కూడా రమేష్ గుర్తుచేశారు. ఇవేవీ ప్రజలు మరిచిపోలేదనీ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. జగన్మోహన్ రెడ్డిగారిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయమన్నారు.టీడీపీలో చిల్లర వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు దేవినేని ఉమ, రేవంత్ రెడ్డి అని విమర్శించారు. వీరికి పనిపాట లేదు.. చిత్తశుద్ధి లేదు..

కాగితంలో నాలుగు మాటలు రాసుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నారు. పచ్చ పత్రికలు జర్నలిజాన్ని అవహేళన చేస్తున్నారన్నారు. పాదయాత్రలో పాపపు సొమ్ము, కిలాడీ పార్టీ అనే శీర్షికలపై ఆయన అభ్యంతరం తెలిపారు. మేమెవర్నీ రమ్మనలేదనీ, లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి పార్టీ జెండాలను పట్టుకుంటున్న అంశాన్ని వారు గమనించాలన్నారు. జర్నలిజం విలువలను మంటగలప వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ పత్రికలను గురించి చెప్పాల్సి వస్తే చాలా ఉందన్నారు. ఒక పత్రిక యజమాని గేదెలు కాసుకునేవాడన్నారు. ఇంత డబ్బు ఆయన ఎలా సంపాదించారో మాకైతే తెలియదన్నారు. మరో  వ్యక్తి ఈ మధ్యనే వచ్చాడనీ, సైకిలుపై పాలు అమ్ముకునే వాడనీ తెలిపారు. గేదెలు కాసుకోవడం, పాలమ్ముకోవడం నామోషీ కాదనీ, కానీ ఇంత వేగంగా వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారనీ రమేష్ ప్రశ్నించారు. ఒక వ్యక్తిమీద బురద జల్లేటప్పుడు మన చరిత్ర కూడా చూసుకోవాలని హితవు పలికారు. మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరకొచ్చాయన్నారు. చంద్రబాబును మీరెంత మీ పత్రికలో ఆకాశానికెత్తినా ఆయన్ని ఎన్నికల్లో నేలకు తొక్కడం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ఖాయమని వారికి తెలియజేస్తున్నానని చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top