<strong>ఉమ్మడిరాష్ర్టంలో ఇచ్చానంటూ బుకాయింపు</strong><strong>అమలు చేయడం సాధ్యం కాదని ముక్తాయింపు</strong> తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలాడడంలో దిట్ట. ఈ విషయాన్ని ఆయన అనేకమార్లు రుజువు చేసుకున్నారు. అబద్దాలను ఆయన అలవోకగా చెప్పేయగలరు. తాను అన్న మాటలను తానే ఖండించుకోగలరు కూడా. అననివి అన్నట్లుగా, అన్నవి అననట్లుగా బుకాయించడంలో ఆయనకెవరూ సాటిరారు. ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీల విషయంలో చంద్రబాబు తన చాకచక్యాన్ని ప్రదర్శించాలని చూడడం తాజాగా చర్చనీయాంశమవుతోంది. ఆ హామీలన్నీ తాను ఉమ్మడి రాష్ర్టంలో ఇచ్చానని వాటిని ఇపుడు అమలు చేయలేనని జన్మభూమి సభలో కుండ బద్దలు కొట్టేశారు. ప్రజలకు ఏమీ జ్ఞాపకం ఉండవని ఆయనకు అపారనమ్మకం. అదే భ్రమలో హామీల విషయంలో బుకాయించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. హామీలు అమలు చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు రావడం, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తరచూ ఈ హామీలపై పట్టుబడుతూ దీక్షలకు దిగుతుండడం చంద్రబాబుకు నిద్రను కరువు చేసింది. వీటి నుంచి తట్టుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన ఓ కొత్త నాటకానికి తెరతీశారు. ఆ హామీలను ఉమ్మడి రాష్ర్టంలో ఇచ్చానని చంద్రబాబు చెబుతున్నవి పచ్చి అబద్దాలే. ఎందుకంటే సాధారణ ఎన్నికలకు ముందే రాష్ర్టం విడిపోయింది. రెండు రాష్ట్రాలకు తెలుగుదేశం పార్టీ విడివిడిగా మేనిఫెస్టోలను కూడా విడుదల చేసింది. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ మేనిఫెస్టోలను పార్టీ వెబ్సైట్లో నుంచి తీసేశారు. మేనిఫెస్టోలు విడుదల చేయడమే కాదు ఎన్నికల కమిషన్కు తన హామీలపై వివరణ ఇస్తూ లేఖ కూడా చంద్రబాబు రాశారు. మేనిఫెస్టోల్లో 600కు పైగా ఇచ్చిన హామీలను చూసి వాటి అమలుపై ఎన్నికల సంఘం వివరణ కోరింది. అందుకు సమాధానంగా 11.04.2014న తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. హామీలు అమలు చేయడం వల్ల ఏటా రాష్ర్ట బడ్జెట్పై పడే భారాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాత మాత్రమే ఈ హామీలపై తాను ఇస్తున్నానని, అమలు చేయగలనన్న విశ్వాసం తనకు ఉందని ఎన్నికల కమిషన్కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటునకు సంబంధించిన బిల్లు ఫిబ్రవరి 20, 2014న పార్లమెంటు ఆమోదించింది. ఆ బిల్లుకు మార్చి 1, 2014న రాష్ర్టపతి ఆమోదముద్ర పడింది. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభకు, రాష్ర్ట శాసనసభకు మార్చి 5, 2014న ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఇవన్నీ జరిగిన తర్వాతే చంద్రబాబు నాయుడు మార్చి 31, 2014న రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేసే నాటికి రాష్ర్టం ఉమ్మడిగా లేదు. కానీ చంద్రబాబు మాత్రం ఉమ్మడి రాష్ర్టంలోనే హామీలిచ్చానని బుకాయిస్తున్నారు. ఇంత పచ్చిగా అబద్దాలాడే వ్యక్తి ముఖ్యమంత్రి వంటి బాధ్యత గలిగిన పదవికి ఎలా అర్హుడవుతాడో రాష్ర్ట ప్రజలు ఆలోచించాలి.