రాజధానికే పరిమితమైన బాబుఉద్యోగుల సమస్యలపై మాట్లాడితే మైక్ కట్ప్రభుత్వంపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజంవిజయవాడ: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రాంతానికి పూర్తి అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాజధాని ప్రాంతానికే అభివృద్ధి అంటూ మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆర్టీసీ, అంగన్‌వాడీ, హోంగార్డు తదితర సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఉద్యోగుల వయో పరిమితి పెంచుతామన్నారు. అన్నింటిని తుంగలో తొక్కి ఉద్యోగుల జీవితాలో ఆటలు ఆడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులకు జీతాలు పెంచి వారిని రెగ్యులరైజ్ చేస్తే ఆ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. అదే విధంగా అంగన్‌వాడీ ఉద్యోగులకు తెలంగాణలో రెండు రెట్లు జీతాలు పెంచారని, ఏపీలో పెంచిన జీతాలు ఇవ్వడానికి కూడ చంద్రబాబుకు దరించడం లేదన్నారు.
సీమ ఉద్యోగులకు ప్రమోషన్లు ఉండవా..?అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఒక ప్రాంతానికే పరిమితమవుతున్నాయన్నారు. రాయలసీమకు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేశామని చెబుతున్నారు కానీ శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం రాయలసీమకే కేటాయించాలంటే దానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ఉద్యోగులను జోన్ 4లో పెట్టారని, జోన్ 4 ఉద్యోగులకు ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. వీటిపై అసెంబ్లీలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని, కర్నూలును రెండో రాజధానిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాజధాని ఉద్యోగాల కేటాయింపుల్లో రాయలసీమ వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.