టీడీపీ వైఖరిని చంద్రబాబు స్పష్టం చేయాలి

హైదరాబాద్ :

రాష్ట్ర విభజనపై టీడీపీ వైఖరి ఏమిటో చంద్రబాబు నాయుడు స్పష్టం చేయాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనా లేక సమైక్యమా దేనికి కట్టుబడి ఉందో వెల్లడించలేని స్థితిలో ఉన్న ఆ పార్టీ, చర్చలో పాల్గొనడం లేదంటూ తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించింది. ఏ ప్రాంతం ఎమ్మెల్యేలతో ఆ ప్రాంతం మాట అసెంబ్లీలో మాట్లాడించే బదులు టీడీపీ విధానాన్ని చంద్రబాబు నాయుడే వెల్లడించాలని డిమాండ్ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గొల్ల బాబూరావు, కొరుముట్ల శ్రీనివాసులుతో కలసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.

‘టీడీపీలోని ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో తాము సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నాం అంటారు.‌ అనంతరం అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మేం తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తారు. వీరిద్దరి ప్రకటనలు వింటూ చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుతారు. కానీ వారి పార్టీ వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రకటించరు. మా పార్టీ విధానం ఇది అని స్పష్టంగా చెప్పలేని స్థితిలో ఉన్న చంద్రబాబు, ఆ పార్టీ నేతలతో మాత్రం వైయస్ఆర్ కాంగ్రె‌స్‌పై విమర్శలు చేయిస్తుంటారు. చర్చలో పాల్గొనలేదంటూ ఆరోపణలు చేయిస్తుంటారు. అసెంబ్లీలో అయినా లేదా ప్రజాక్షేత్రంలో అయినా ఎక్కడైనా వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందనే చెబుతోంది. ఈ వైఖరికి మా పార్టీ కార్యకర్త మొదలు, ఎమ్మెల్యేలు, అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ సభా నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కూడా కట్టుబడి ఉన్నాం. ఇం‌త స్పష్టంగా చంద్రబాబు తమ పార్టీ విధానాన్ని వెల్లడించగలరా?’ అని‌ శ్రీకాంత్‌రెడ్డి సవాల్ చేశారు.

Back to Top