తండ్రీకొడుకులు ఇద్దరూ 420లే

  • నారా కుటుంబానిది బూటకపు ఆస్తుల ప్రకటన
  • 6 నెలల్లో రూ. 14 కోట్ల నుంచి రూ. 330 కోట్లు ఎలా పెరిగాయో
  • రాష్ట్రంలో దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌ లోకేష్‌బాబు
  • అబద్ధాలు ఆడడంలో తండ్రిని మించి ముదిరిన చినబాబు
  •  ప్రజల దృష్టి మళ్లించడానికి వైయస్‌ జగన్‌పై బురదజల్లె ప్రయత్నం
  • చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వారసుడు దొడ్డిదారిన ఎమ్మెల్సీ కాలేదు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

గుంటూరు: తండ్రి కొడుకులు నారా చంద్రబాబు, లోకేష్‌లను మించిన దొంగలు, మోసగాళ్లు, 420లు ఎవరూ ఉండరనేది జగమెరిగిన సత్యం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. 6 సంవత్సరాలుగా ఆస్తుల ప్రకటన అంటూ దొంగ లెక్కలను చూపించి ఆంధ్రరాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారని మండిపడ్డారు. నారా వారి బూటకపు ఆస్తుల ప్రకటనపై అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో గురువారం అంబటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన లోకేష్‌ అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను స్పష్టంగా పొందుపర్చారని చెప్పారు. గత అక్టోబర్‌ నెలలో రూ. 14.5 కోట్లుగా ఉన్న ఆస్తిని అఫిడవిట్‌లో రూ. 330.14 కోట్లుగా ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. నామినేషన్‌లో పూర్తి ఆస్తుల వివరాలు పొందుపర్చకపోతే నామినేషన్‌ రద్దు అవుతుందనే... ఇంతకాలం ప్రజలకు తెలియకుండా దాచిన ఆస్తులను లోకేష్‌ అఫిడవిట్‌లో పొందుపర్చారని అంబటి దుయ్యబట్టారు.  గతంలో రూ. 14.5 కోట్లు ఉన్న ఆస్తులు ఆరు నెలల్లో రూ. 330.14 కోట్లు ఎలా అయ్యాయని లోకేష్‌ను అంబటి నిలదీశారు. 

రూ. 200ల నుంచి రూ. 1134లకు ఎలా పెరిగాయ్‌
చంద్రబాబు 2 ఎకరాలతో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి వేలకోట్లు ఏ విధంగా సంపాదించారో సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. పాలు, కూరగాయాలు అమ్ముకొని బతికేవాళ్లం అంటూ నాటకాలు ఆడుతున్నారని బాబు, లోకేష్ లపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 2004లో హెరిటేజ్‌ షేర్‌ విలువ రూ. 55 ఉంటే అది 2009 నాటికి అది రూ. 41కి పడిపోయిందన్నారు. 2014 జనవరిలో చంద్రబాబు అధికారంలోకి రాకముందు రూ. 220 ఉంటే మార్చి నాటికి రూ. 200లకు పడిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 2014–17 వరకు హెరిటేజ్‌ షేర్‌ వాల్యూ రూ. 1134లకు పెరిగిందన్నారు. మూడు సంవత్సరాల వ్యవధిలో ఇంత గణనీయంగా షేర్‌ విలువ ఎలా పెరిగిందని అంబటి ప్రశ్నించారు. మీ అధికార దుర్వినియోగం వల్ల పెరగలేదా అని చంద్రబాబు, లోకేష్‌లను ప్రశ్నించారు. రాష్ట్రంలో దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా లోకేష్‌బాబు తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తరువాత లోకేష్ క్యాబినెట్‌లోకి కూడా దోచుకోవడానికి వస్తున్నారనేది తేటతెల్లమవుతోందన్నారు. 

హైటెంతంటే పుట్టినప్పటి హైట్‌ చెబుతావా లోకేష్‌
శాసనమండలిలో అడుగుపెట్టే సమయానికి తండ్రిని మించిన తనయుడిలా అబద్ధాలు ఆడటంలో లోకేష్‌ ముదిరిపోయాడని అంబటి ఎద్దేవా చేశారు. మేము ఇంత వరకు ప్రకటించిన ఆస్తులు వివరాలు మార్కెట్‌ వాల్యూ ప్రకారం ప్రకటించలేదు. కొన్న వాల్యూ ప్రకారం ప్రకటించామని మరోసారి ప్రజలను వంచించే కార్యక్రమానికి పూనుకున్నారని మండిపడ్డారు. అయ్యా లోకేష్‌ మీ ఎత్తు ఎంతంటే పుట్టినప్పుడున్న హైట్‌ 14 అంగుళాలు అని చెబుతారా అని అంబటి ప్రశ్నించారు. పుట్టినప్పటి ఎత్తు చెబితే అది అబద్ధం కాదా అని నిలదీశారు. 2014లో నారా కుటుంబం ఆస్తుల ప్రకటన అంటూ కొత్త డ్రామాకు తెరతీసిందని అంబటి విరుచుకుపడ్డారు. నీతి, నిజాయితీకి మారుపేరు మా కుటుంబం అంటూ చంద్రబాబు, లోకేష్‌లు తప్పుడు ఆస్తులను చూపించి ప్రజలను మోసం చేశారని, దానికి లోకేష్‌ అఫిడవిటే నిదర్శనమని దుయ్యబట్టారు. నారా బ్రాహ్మణి, భువనేశ్వరి ఆస్తులు కూడా వేల కోట్లు ఉన్నట్లుగా అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదేం తప్పుడు ఆస్తులు అంటే అప్పుడు అబద్ధాలు చెప్పాం.. ఇప్పుడు నిజాలు చెబుతున్నాం అంటూ బొంకుతున్నారని ఆరోపించారు. 

తప్పుడు లెక్కలు చెప్పడం వైయస్‌ జగన్‌ నైజం కాదు
తప్పుడు ఆస్తుల ప్రకటనపై ప్రజల దృష్టి మళ్లించడానికి... నారా లోకేష్‌ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దూషించే కార్యక్రమానికి పూనుకున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఆస్తులు ప్రకటించాం... వైయస్‌ జగన్‌ ఎందుకు ప్రకటించరంటూ ప్రశ్నలేస్తున్నారే.. మీరు దొంగ లెక్కలు ప్రకటించారని.. వైయస్‌ జగన్‌ను కూడా దొంగ లెక్కలు ప్రకటించమంటారా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి తన ఆస్తుల వివరాలను ఎలక్షన్‌ కమీషన్‌కు ఇవ్వడం జరుగుతోందని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లా దొంగ లెక్కలు చూపించడం వైయస్‌ జగన్‌ వైఖరి కాదని దుయ్యబట్టారు. వైయస్‌ జగన్‌కు కోట్లు పెరిగాయంటూ లోకేష్‌ ఆరోపిస్తున్నారు... ఏ తప్పు చేయకపోయినా ఆయన సీబీఐ ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు. మీపై కూడా సీబీఐ విచారణ వేసుకోగలరా.. మీకా దమ్మూ, ధైర్యం ఉందా అని లోకేష్‌ను ప్రశ్నించారు. చంద్రబాబుపై 40 కేసులు పెట్టారంటున్నారు.. ఒక్క కేసునైనా మీ నాన్న నేరుగా విచారణను ఎదుర్కొన్నారా అని నిలదీశారు. 

అంత ధైర్యం ఉంటే పోటీ చేసి గెలవొచ్చుగా..
2019లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందనే ధైర్యమే ఉంటే లోకేష్‌ ఎందుకు పోటీ చేయకుండా దొడ్డిదారిన శాసనమండలికి ఎన్నికవుతున్నారో సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు. నిజంగా వైయస్‌ జగన్‌కు ప్రజావ్యతిరేకత ఉంటే లోకేష్‌ దొడ్డిదారిన రావాల్సిన అవసరం ఏముందన్నారు. ఇంత వరకు ఏ ముఖ్యమంత్రి వారసుడైనా ఇలా దొడ్డిదారిన చట్టసభకు ఎన్నికైన దాఖళాలు లేవని స్పష్టం చేశారు. వైయస్‌ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ తట్టుకోలేక రాంగ్‌రూట్‌లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యావంటూ లోకేష్‌పై విరుచుకుపడ్డారు. వాస్తవాలు ప్రచురించే ‘సాక్షి’ పత్రికకంటే ముందు హిందుస్థాన్‌ అనే ఆంగ్ల పత్రిక లోకేష్‌ ఆస్తులు ఇంత గణనీయంగా ఎలా పెరిగాయంటూ ప్రశ్నించిందని చెప్పారు. హిందుస్థాన్‌ జాతీయ పత్రికను ఏమనలేక సాక్షిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్‌వన్నీ పచ్చి అబద్దాలని, తక్షణమే ప్రజలకు సమాధానం చెప్పి క్షమాపణ కోరాలని డిమాండ్‌ చేశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హెరిటేజ్‌ వాల్యూ ఎలా పెరిగిందో చెప్పాలన్నారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు,లోకేష్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 
Back to Top