గుంటూరు : చంద్రబాబు నాయుడు ఎప్పుడు రైతులకు వ్యతిరేకమేనని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబే స్వయంగా చెప్పారని, టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులను పట్టించుకోదని విమర్శించారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో ‘రైతు దీక్ష’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రైతు దీక్షా ప్రాంగణంలో ధర్మాన మాట్లాడుతూ.... ఎన్నికలప్పుడు తాను మారానని చంద్రబాబు చెప్పారని, ముఖ్యమైన ప్రాజెక్టులను పక్కనపెట్టి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు.
వైయస్‌ఆర్ కలల ప్రాజెక్ట్ అయిన పోలవరానికి జాతీయ హోదా వచ్చిందని, అయితే చంద్రబాబు ఆ పోలవరం పనులను కూడా పట్టించుకోవడం లేదని ధర్మాన ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కావల్సింది రైతుల సంక్షేమం కాదని, ఆయన ఏనాడు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతులు అధైర్య పడవద్దని, వైయస్ జగన్ రైతుల వెంట ఉంటారని ధర్మాన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే వైయస్ జగన్ దీక్ష చేపట్టారన్నారు. ఎన్నికలెప్పుడు వచ్చినా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని, వైయస్‌ఆర్ సీపీని గెలిపిస్తేనే రైతులకు మేలు జరుగుతుందని ధర్మాన అన్నారు. చంద్రబాబును కూకటివేళ్లతో పెకిలిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.